ఐనవోలు, జనవరి 13 : జానపదుల జాతరగా పేరొందిన ఐనవోలు బ్రహ్మోత్సవాలకు సోమవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మమ్మేలు మల్లన్నా అంటూ స్వామిని వేడుకున్నారు. భోగి పండుగ పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో ఆలయం పోటెత్తింది. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, పట్నాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. కోరిన కోర్కెలు తీర్చిన కోరమీసాల మల్లికార్జున స్వామికి కోడెను కట్టి, పట్నాలు వేసి, గండ దీపం వెలిగించి, పెద్ద శావ తీసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
ఉదయం నుంచే తాకిడి పెరగడంతో స్వామిని దర్శించుకోవడానికి దాదాపు రెండు నుంచి మూడు గంటలు పట్టింది. భక్తులు పడమర వైపున ఉన్న ఎల్లమ్మ దేవాలయంలో బోనాలు సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ, పోలీసు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఐలోని మల్లన్నను స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, వరంగల్ మేయర్ సుధారాణి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తదిరులు దర్శించుకున్నారు. కాగా, మంగళవారం సంక్రాంతి సందర్భంగా ఆలయంలో విశేష పూజలతో పాటు రాత్రి పెద్దబండి, ఐనవోలు, ఒంటిమామిడిపల్లి, ముల్కలగూడెం, పెరుమాండ్లగూడెం గ్రామాల ప్రభ బండ్లు తిరిగే కార్యక్రమం నిర్వహిస్తారు.