హనుమకొండ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను బుధవారం సాయంత్రం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టరేట్లోని జీ-36లో ఏర్పాటు చేసిన ఈ మీడియా సెంటర్లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ)లు ఉంటాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఎప్పటికపుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎంసీఎంసీ కమిటీ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెకించడం, సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల ప్రకటనలకు సకాలంలో ఆమోదం తెలుపాలన్నారు. శాటిలైట్ ఛానెల్స్‌లో వచ్చే వార్తలను పూర్తి స్థాయిలో రికార్డు చేయాలని కలెక్టర్ సూచించారు. వార్తా పత్రికలు, ఈ-పేపర్లు, టెలివిజన్ చానెల్లు, స్థానిక కేబుల్ నెట్వర్లు, సోషల్ మీడియా, మూవీ హౌస్‌లు, ఎస్ఎంఎస్లతో పాటు ఇతర ఆడియో-వీడియో విజువల్ మీడియాలతో సహా ప్రకటనలను ఎంసీఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.
ఫిర్యాదులకు కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నెంబర్
శాసనసభ ఎన్నికల సందర్భంగా సంబంధిత ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్‌తో పాటు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1816ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. ఎన్నికల ఫిర్యాదుల కోసం ఈ టోల్‌ఫ్రీ నెంబర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో మీడియాదే కీలక పాత్ర అన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కార్యక్రమంలో డీపీఆర్వో లక్ష్మణ్ కుమార్, ఇ భూపాల్, అరుణ, ఎన్నికల సిబ్బంది, సోషల్ మీడియా సిబ్బంది, జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు.