దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం సంబురంగా జరిగింది. శనివారం ఉదయం జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 32 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. అలాగే మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు, సీసీ రోడ్లను పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.15 లక్షల వ్యయంతో గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసి, గ్రామంలో ప్రతిష్ఠించిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇళ్లులేని నిరుపేదలకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు అందించి వారి సొంతింటి కలను సాకారం చేశారని వివరించారు. తాను మొదటిసారి గ్రామానికి వచ్చినప్పుడు తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని మహిళలు ఖాళీబిందెలతో స్వాగతం చెప్పేవారని ఇప్పుడు సీఎం కేసీఆర్ కృషితో ఇంటింటికీ స్వచ్ఛమైన ‘మిషన్‌భగీరథ’ నీరు అందుతున్నదని పేర్కొన్నారు. మరోవైపు మండలంలోనే పెద్ద చెరువైన సింగరాయ చెరువును గోదావరి జలాలతో నింపడం వల్ల సాగునీటి సమస్య తీరిందన్నారు. గ్రామంలో రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.
ఇళ్లు రాని వారు నిరాశపడొద్దని, వారికి రూ.3 లక్షలు అందించి సొంత స్థలంలో ఇల్లు మంజూరు చేయిస్తామని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ జిల్లాకు 4,230 ఇండ్లు మంజూరు కాగా, వీటిలో పాలకుర్తి నియోజకవర్గంలోనే రెండు వేల ఇండ్లు నిర్మించినట్లు తెలిపారు. సర్పంచ్ గోపాల్‌దాస్ మల్లేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ బస్వ సావిత్రి, జడ్పీటీసీ పల్లా భార్గవిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లింగాల రమేశ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఆర్డీవో మధుమోహన్, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, హౌసింగ్ ఈఈ దామోదర్‌రావు, అడిషనల్ డీఆర్డీవో నూరొద్దీన్, కొండల్‌రెడ్డి, తహసీల్దార్ ఫణికిశోర్, ఎంపీడీవో ఉమామహేశ్వర్, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్‌కుమార్, ఉప సర్పంచ్ చినబుచ్చిరెడ్డి పాల్గొన్నారు.
ఇరవై ఐదేళ్ల క్రితం సింగరాజుపల్లికి బతుకచ్చినం. నాకు ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. మొదటినుంచి కిరాయి ఇంట్లనే ఉంటున్నం. నా భర్త జనార్దన్ చనిపోతే, ఊరి జనమే అంత్యక్రియ లు చేసిన్రు. పెద్ద బిడ్డ పెండ్లిజేసిన. ఇంకో అమ్మా యి 9వ తరగతి చదువుతాంది. ఇద్దరు కొడుకులు ఊళ్లెనే వడ్రంగి, ప్లంబర్ పనికి పోతాన్రు. ఓటు, రేషన్‌కార్డు ఇచ్చిండ్రు. కానీ, సొంతిల్లు లేక ఇబ్బంది పడేది. ఇప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి దయన్న పుణ్యమా అని డబుల్ బెడ్ రూమ్ వచ్చింది. దుర్గమ్మ పండుగకు ఇల్లు అచ్చుడు సంతోషంగా ఉంది.
– బ్రహ్మదేవర వరలక్ష్మి, లబ్ధిదారు, సింగరాజుపల్లి
సింగరాజుపల్లి ప్రజల సొంతింటి కల సాకారమైంది. శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతులమీదుగా 32 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది. దుర్గమ్మ పండుగ వేళ గృహప్రవేశం చేసినందుకు లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివెరిసింది. ఇన్నాళ్లు గూడు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తమకు ఇండ్లు వచ్చాయంటూ సంతోషం వ్యక్తంచేశారు.
– దేవరుప్పుల, ఏప్రిల్ 23