ఖిలావరంగల్, అక్టోబర్ 4: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో రూ. 4100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 38వ డివిజన్ రుద్రమాంబనగర్లో రూ. 4 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనులకు కార్పొరేటర్ బైరబోయిన ఉమతో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. 34వ డివిజన్ శివనగర్‌లో వినాయక ట్రస్టు భవన్ మండప నిర్మాణానికి కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరంగల్ తూర్పులో ప్రధాన రహదారుల నిర్మాణం పూర్తి చేశామన్నారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని సుమారు 15 వేల మందికి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని నన్నపునేనికి స్థానిక మహిళలు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్, వినాయక ట్రస్ట్ భవన్ అధ్యక్షుడు సాదుల దామోదర్, పగడాల సతీశ్, మంద అక్షిత్, కొత్తపెల్లి శ్రీనివాస్, వాసం సదానందం, కాసుల ప్రతాప్, రావుల రాజేశ్, బైరబోయిన సరోజన పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి ఆదరించాలి
కాశీబుగ్గ: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కాశీబుగ్గలోని 20వ డివిజన్లో రూ. 66.50 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తిలక్‌రోడ్డు అభివృద్ధికి రూ. 30 లక్షలు, బీఎన్రావుకాలనీ కమ్యూనిటీ హాల్ మరమ్మతులకు రూ. 18.50 లక్షలు, తిలక్‌రోడ్డు బొమ్మ వరకు రోడ్డు కోసం రూ. 18.10 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, మాజీ కార్పొరేటర్ బయ్యాస్వామి, కార్యకర్తలు ఇక్బాల్, పెండ్యాల సోనిబాబు, ముష్కే ప్రమీల, బుర్ర నటరాజ్, చిమ్మని గోపి, పల్లకొండ హరికుమార్ పాల్గొన్నారు.