వాజేడు, జనవరి 11: ములుగు జిల్లా వాజేడు మండలంలో ముమ్మరంగా మిర్చికోతలు ప్రారంభమయ్యాయి. మిర్చి కోసి, వాటిని కల్లాల్లో ఆరబోసే కూలీలకు చేతినిండా పని దొరుకుతోంది. రోజు కూలి సైతం రూ. 300 వస్తుండడంతో ఈ పనులకు ఆసక్తి చూపుతున్నారు. వాజేడు, గుమ్మడిదొడ్డి, సుందరయ్య కాలనీ, చండ్రుపట్ల, అయ్యవారిపేట, ధర్మవరం, పేరూరు, పెద్ద గొల్లగూడెం, చింతూరు, కృష్ణాపురం, టేకులగూడెం తదితర గ్రామాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పదివేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. అయితే గతేడాది క్విం టా మిర్చి క్వాలిటీని బట్టి రూ. 22 వేల వరకు ధర పలికినప్పటికీ ఈ సారి బహుళ జాతి ఒప్పం ద సంస్థ క్వింటాకు రూ. 12 వేలు మాత్రమే ఇస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. పెట్టుబడి పెరిగి ధర తగ్గడంతో వారు దిగులు పడుతున్నారు.