హనుమకొండ, డిసెంబర్ 18 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ కార్యాలయాలు చీటింగ్‌కు అడ్డాలుగా మారాయి. చిట్ కంపెనీల యజమానులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, ఉద్యోగులు కుమ్మకై ప్రజలు చిట్టీలకు కట్టిన డబ్బుల ను దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్ భద్రత, అవసరాల కోసం చిట్ ఫండ్లలో చేరిన సామాన్య ప్రజలు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. చిట్ కాలం పూర్తయినప్పటికీ డబ్బులు చెల్లించకుండా కంపెనీ యజమానులు సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
మరికొన్ని చోట్ల సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో వసూలు చేసిన భారీ మొత్తాలపై కన్నేసి రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులతో కలిసి గుట్టుచప్పుడు కాకుండా డ్రా చేసుకుంటున్నారు. ఓ చిట్‌ఫండ్ కంపెనీ యజమాని పెద్ద మొత్తంలో డబ్బుల ఎరచూపి డిపాజిట్ సొమ్మును విడిపించేందుకు ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడం, వారు ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే డిపాజిట్స్ డ్రాకు బ్రేక్ పడ్డట్లు తెలిసింది. అయితే పలువురు చిట్‌ఫండ్ కంపెనీల బాధితులు బుధవారం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి తమకు డబ్బులు ఇప్పించాలని రిజిస్ట్రార్ బీ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
సెక్యూరిటీ డిపాజిట్‌పై కన్ను
కొత్త చిట్టీ ప్రారంభించే సమయంలో దాని మొత్తాన్ని రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ కార్యాలయంలో సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. సదరు కంపెనీల్లో ఏమైనా ఇబ్బందులు వస్తే సబ్యులకు ఆ డబ్బును అందజేస్తారు. చిట్టీ కాలపరిమితి పూర్తయి, సభ్యులకు డబ్బులు చెల్లించే వరకు వీటిని వినియోగించడం, రిజిస్ట్రార్ అనుమతి లేకుండా విపిపించడం జరగదు. అయితే చాలా చిట్ సంస్థలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఆ శాఖ అధికారులను మచ్చిక చేసుకొని డిపాజిట్ మొత్తాన్ని డ్రా చేసుకొని వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కనుకదుర్గ చిట్‌ఫండ్‌కు చెందిన బాధితులకు రూ. 3 కోట్లు పంపిణీ చేయడంపై పలువురు బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తూ డీఐజీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అసలైన లబ్ధిదారులకు ఇవ్వకుండా చిట్‌ఫండ్ యజమాని, కార్యాలయ ఉద్యోగులు కలిసి బినామీలకు చెక్కులు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో అసలైన లబ్ధిదారులు డీఐజీకి ఫిర్యాదు చేయగా, పంపిణీ చేసిన చెక్కులను క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవ నివేదిక ఇవ్వాలని జిల్లా రిజిస్ట్రార్‌ను ఆదేశించినట్లు తెలిసింది. కాగా, చెక్కులు అందుకున్న లబ్ధిదారుల జాబితాను వెల్లడించేందుకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు నిరాకరించడంపై అనేక అనుమానాలకు తావిస్తున్నది.
రూ. 25లక్షలు రావాలి
నేను అక్షర, కనకదుర్గ చిట్‌ఫండ్స్‌లో చిట్టీలు వేయగా, అవి 2021లోనే అయిపోయాయి. రూ. 25 లక్షల వరకు రావాల్సి ఉంది. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను. 2023లో చిట్టి డబ్బుల విషయంలో జిల్లా రిజిస్ట్రార్‌కు కూడా ఫిర్యాదు చేశాను. కనకదుర్గ చిట్‌ఫండ్ బాధితులకు సెటిల్మెంట్ అయ్యింది. రూ. 3.50 కోట్లు ఇచ్చినట్లు పేపర్లలో రావడం చూసి ఈ రోజు జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చాను. నేను ఎప్పుడో దరఖాస్తు చేసినా, నాకివ్వక వేరే వారికి ఇచ్చామంటున్నారు. ఇందులో కొంత అనుమానం వస్తున్నది. డబ్బుల విషయంలో డీఆర్‌ను కలిసి అడిగితే అసలు ఇప్పిస్తాను, మిగతా విషయాలు నాకు తెలువదని అంటున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను.
– వీ అశోక్, కాంట్రాక్టర్
పారదర్శకంగా చెక్కులు అందజేశాం..
కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపు ఆదేశాల మేరకు సోమవారం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో కనకదుర్గ చిట్‌ఫండ్ డైరెక్టర్ల సమక్షంలో బాధితులకు రూ. 3 కోట్లు పంపిణీ చేశాం. ఇందులో 13 మంది చి ట్టి మధ్యలో ఆపేసినవారు(డిఫాల్టర్స్), 12 మంది ప్రైస్డ్ సబ్ స్కైబర్స్(చిట్టి ఎత్తుకున్నవారు) ఉన్నారు. ఎక్కడా అవినీతికి ఆస్కా రం లేదు. బినామీలు ఎవరూ లేరు. పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులకు చెక్కులు అందజేశాం. చిట్ ఫం డ్స్ కంపెనీ బాధితులు జిల్లా రిజిస్ట్రార్‌కుగానీ, సహాయక చిట్ రిజిస్ట్రార్‌కు గానీ ఫిర్యాదు చేస్తే డబ్బులు ఇప్పించేందుకు ప్ర యత్నం చేస్తాం.