హనుమకొండ చౌరస్తా, జూన్ 30 : కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య (ఎస్డీఎల్సీఈ) పరీక్షల్లో జోరుగా మాస్‌కాపీయింగ్ జరుగుతోంది. పరీక్షల్లో కాపీయింగ్, అక్రమాలు జరిగినట్లు గతంలో ఆరోపణలు, నివేదికలు వచ్చినప్పటికీ అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది. నగరంలోని కాకతీయ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, అల్లూరి కాలేజీ, ఏఎస్ఎం, ఎల్బీ కాలేజీ, ఆర్ట్స్ కాలేజీలో పీజీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పరీక్షలు పూర్తి కావస్తున్నా యూనివర్సిటీ అధికారుల పర్యవేక్ష లేకపోవడంతో విద్యార్థులు చిటీలుపెట్టి పరీక్షలు రాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్ష కేంద్రంలో ఉండి పర్యవేక్షించాల్సిన యూనివర్సిటీ అధికారి పరీక్ష మొదలయ్యే సమయంలో మాత్రమే ఉండి మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తున్నది.
దూరవిద్య కేంద్రాల నిర్వాహకులు కొందరు విద్యార్థులకు చిట్టీలు ఇవ్వగా, మరి కొందరు విద్యార్థులు పాత పుస్తకాలు చింపుకొని వెంట తెచ్చుకున్నట్లు సమాచారం. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు, పదోన్నతుల కోసం, గృహిణులు, నిరుద్యోగులు విద్యార్హత కోసమే అధిక శాతం దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ చదువుతున్నారు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకొని నిర్వాహకులు విద్యార్థుల నుంచి రూ.వేయి నుంచి రూ.2 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం.
దూరవిద్య కేంద్రాల ద్వారా చదువుతున్న వారి నుంచి యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించి, సకాలంలో మెటీరియల్ అందజేయాల్సి ఉంది. అయితే యూనివర్సిటీ అధికారులు ఏడాదైనా పుస్తకాలను సరఫరా చేయకపోవడంతో నిర్వాహకులకు కలిసి వస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకొని పరీక్షలను చూచి రాయిస్తామని విద్యార్థుల నుంచి వసూళ్లు చేస్తున్నారు.
పరీక్షలు రాసేవారు ముందుగానే సూక్ష్మ జిరాక్స్ తీసుకొని వెళ్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నగరంలోని పలు జిరాక్స్ షాపుల్లో ఇన్‌సర్వీస్ ఉద్యోగులు పుస్తకాలు తీసుకొచ్చి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సూక్ష్మ జిరాక్స్ తీసుకువెళ్లడం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇన్విజిలేటర్ ప్రశ్నాపత్రం ఇచ్చాక విద్యార్థులు సమాధానాలు చిట్టీలను చూసి ఒకరి తర్వాత ఒకరు రాస్తున్నారు. పరీక్షల పర్యవేక్షణకు మాత్రం యూనివర్సిటీ నుంచి వచ్చేవారిని నిర్వాహకులు ముందుగానే తమకు అనుకూలమైన వారిని డ్యూటీలో వేయించుకున్నట్లు సమాచారం. అందుకు వచ్చిన అధికారి కాసేపు ఉండి వెళ్లిపోయినట్లు తెలుస్తున్నది. డిగ్రీ, పీజీ దూరవిద్య పరీక్షల్లో కాపీయింగ్ జరిగినట్లు యూనివర్సిటీ అధికారుల విచారణలో తేలుతున్నా అటువైపు వెళ్లింది లేదు ఆయా కాలేజీ సెంటర్‌ను రద్దు చేసిన దాఖలాలు కూడా లేదు. ఇంత తతంగం జరుగుతున్నా ఒక్కరిని కూడా డిబార్ చేయలేదని తెలుస్తోంది. ప్రతి యేటా ఇదే తంతు జరుగుతోందని దూరవిద్య పరీక్షల్లో ఇది కామన్ అనుకోవడం అందరి వంతైంది.
కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య పరీక్షల్లో ఏడాదికేడాది చూచిరాతల జోరు పెరుగుతున్నా నియంత్రించ లేకపోతున్నారు. సాధారణంగా దూరవిద్య అంటే సెలవు రోజుల్లో క్లాస్‌లు నిర్వహించి, రికార్డులు, సైన్స్ విద్యార్థులకు ల్యాబ్‌లో ప్రాక్టికల్ చేయించాలి. పరీక్షలకు నాలుగు నెలల ముందుగానే కోర్సు మెటీరియల్ ఇవ్వాలి. ఏడాదిగా యూనివర్సిటీ అధికారులు ఆదాయంపై ఉన్న ధ్యాస విద్యార్థులకు ఇవ్వాల్సిన మెటీరియల్, క్లాస్‌లు, ల్యాబ్‌పై పెట్టకపోవడం కూడా మాస్ కాపీయింగ్‌కు కారణమనే విమర్శలున్నాయి.