పేరుకుపోతున్న చెత్త.. ఎక్కడికక్కడే కంపుకొడుతున్న పరిసరాలు స్మార్ట్‌సిటీగా చెప్పుకుంటున్న వరంగల్ నగరంలో పారిశుధ్యం మూలన పడింది. చెత్త తరలించే వాహనాలు రిపేర్ షెడ్లో తుప్పుపడుతున్నాయి. 50 స్వచ్ఛ ఆటోలు, 20 ట్రాక్టర్లు మరమ్మతుల పేరుతో మూలుగుతున్నాయి. దీంతో గ్రేటర్‌లోని అనేక కాలనీల్లో 10 రోజులకోసారి కూడా స్వచ్ఛ ఆటోలు రాకపోవడంతో ఇంట్లో చెత్త పేరుకుపోతున్నది. అపార్ట్మెంట్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన పారిశుధ్య వ్యవస్థను బల్దియా అధికారులు గాలికొదిలేయడంతో ఎక్కడికక్కడే కంపు కొడుతోంది. ప్రజారోగ్య, ఇంజినీరింగ్ విభాగాల మధ్య సమన్వయ లోపంతో ఈ సమస్య జఠిలంగా మారుతోంది.
– వరంగల్, డిసెంబర్ 26
నగరంలో చెత్త తరలించే వాహనాలు రిపేర్ షెడ్లకే పరిమితమవుతున్నాయి. రోజుల తరబడి స్వచ్ఛ ఆటోలు ఇంటికి రావడం లేదన్న ఫిర్యాదులు వందల్లో వస్తున్నాయి. 407 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణకు 360 స్వచ్ఛ ఆటోలు, 80 ట్రాక్టర్లు ఉన్నాయి. ప్రతి రోజూ ఇంటింటి చెత్త సేకరణ, డంపింగ్ యార్డులకు తరలింపులో కీలకంగా ఈ వాహనాలు పనిచేస్తున్నాయి. అయితే వీటిలో రోజూ సుమారు 100 వాహనాలు వివిధ రిపేర్ల పేరుతో రోడ్డెక్కడం లేదు. 50 స్వచ్ఛ ఆటోలు, 20 ట్రాక్టర్లు మరమ్మతుల పేరుతో మూలునపడ్డాయి. దీంతో నగరంలో పారిశుధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది.
వివిధ రిపేర్లతో చెత్త తరలించే వాహనాలకు వెంటనే మరమ్మతులు చేయకపోవడంతో నెలల తరబడి షెడ్లోనే ఉంటున్నాయి. కొత్త వాహనా లు సైతం తుప్పుపడుతున్నాయి. స్వ చ్ఛ ఆటోలు 50పైగా, 20 ట్రాక్టర్లు, డంపర్ బిన్స్, కంపాక్టర్ బిన్స్లు పదుల సంఖ్యలో షెడ్లోనే ఉన్నా యి. మరమ్మతులపై అధికారుల పర్యవేక్షణ కరువవడంతో ఎన్ని వాహనాలు రిపేరులో ఉన్నాయి?, ఎన్ని క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాయన్న దానిపై సరైన లెక్కలు తెలియకపోవడం గమనార్హం. బల్దియాలో పారిశుధ్య వాహనాల వినియోగమంతా ప్రజారోగ్య విభాగం, మరమ్మతులు ఇంజి నీరింగ్ విభాగం చూసుకుంటుంది. వాహనం మరమ్మతు కోసం ప్రజారోగ్య విభాగం అధికారి షెడ్‌కు పంపిస్తే ఇంజినీరింగ్ విభాగం అధికారి అప్రూవల్ ఇస్తేనే రిపేరు చేస్తారు. ఇద్దరి మధ్య సమన్వయం లోపంతో రోజుల తరబడి వాహనాలు రిపేర్ల కోసం షెడ్లో ఉండాల్సి వస్తోంది.
క్లీన్ సిటీ లక్ష్యం నెరవేరాలంటే ఇంటింటి చెత్త సేకరణ అత్యంత కీలకం. ప్రతి రోజూ స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయాలి. అయితే గ్రేటర్‌లోని అనేక కాలనీల్లో 10 రోజులకొకసారి కూడా స్వచ్ఛ ఆటోలు వెళ్లడం లేదు. రోజు వందల ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో ఇళ్లు, అప్టార్ట్మెంట్లలో చెత్త పేరుకుపోతున్నది. ప్రతి నెల రూ.60 చెత్త పన్ను పేరిట ఆస్తి పన్నులో కలిపి వసూలు చేస్తున్న బల్దియా అధికారులు చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. చెత్త వాహనాల కొరత ఒకవైపు.. రిపేర్ల పేరుతో రోడ్డెక్కని వాహనాలతో నగర పారిశుధ్య వ్యవస్థ పడకేసింది.