ములుగు, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : వెంకటాపూర్ మండలం రామ ప్ప సమీపంలో సముద్ర జీవుల చిత్రాలు వెలుగు చూశాయి. డిస్కవరీ మ్యాన్ రత్నాకర్‌రెడ్డి, మట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిశోధన చేయగా ఆదిమానవులు వేసిన చిత్రాల స్థావరంలో సముద్ర జీవుల చిత్రాలు గుర్తించారు. వెంకటాపూ ర్ మండల కేంద్రానికి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న గుట్టలపై చంద్రవంక వంటి పడగరాయి కింద అరుదైన చిత్రాలను గుర్తించారు.
ఇవి పాండవుల గుట్ట వద్ద ఉన్న చిత్రాల కంటే పురాతన, వైవిద్యమైన చిత్రాలుగా కనిపిస్తున్నాయని రత్నాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదిమానవులు మూడు దశల్లో చిత్రాలు వేయ డం ద్వారా పాత చిత్రాలపై కొత్త చిత్రా లు, వాటిపై గండు చిత్రాలు వచ్చాయన్నారు. ఎరుపు, నలుపు, తెలుపు రంగులను ఈ చిత్రాల్లో ఉపయోగించినట్లు తేలిందన్నారు.
గుట్ట దిగువన వందల ఎకరాల్లో విస్తరించిన మైదాన ప్రాంతాల్లో విస్తారంగా రాతి గొడ్డళ్లు, బ్లేడ్ వంటి పరికరాలు లభించాయన్నారు. ఈ చిత్రాల స్థావరం యునెస్కో గుర్తింపు పొందిన రామప్పకు ఎనిమిది కిలో మీటర్ల దూరం లో ఉందని, పర్యాటకంగా అభివృద్ధి చేస్తే విశేష ఆదరణ లభిస్తుందన్నారు. పరిశోధనలో దేశెట్టి జితేందర్, వినయ్, రాజు, నాగరాజు, మహేశ్, రాజేశ్, రాజ్‌కుమా ర్, ప్రభంజన్, ఓంకార్, విఘ్నేశ్, నరేశ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.