ఓరుగల్లు కోటలో ప్రారంభించిన ఇల్యుమినేషన్ లైట్స్ అండ్ సౌండ్ షో ఫ్లాప్ షోగా మారింది. పురావస్తు శాఖ అధికారుల అలసత్వమో.. ఎన్నికలకు ముందే మమ అనిపించాలనే కేంద్ర మంత్రుల ఆరాటమో కాని.. రూ. కోట్లు వెచ్చించి తెచ్చిన పరికరాలు పిచ్చుకలకు ఆవాసాలుగా మారాయి. పోటాపోటీ నినాదాలతో కేంద్ర, రాష్ట్ర మంత్రులు అట్టహాసంగా ప్రారంభించి పదకొండు నెలలైనా ఇప్పటికీ లైటు వెలగడం లేదు.. సౌండ్ వినిపించడం లేదు. హైదరాబాద్ గోల్కొండ ఖిల్లాను మించి ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకోవడంతో ఆసక్తిగా వస్తున్న పర్యాటకులు ఈ ప్రదర్శన ఆదిలోనే ఆగిందని తెలుసుకొని నిరాశ పడుతున్నారు. చేసేదేమీ లేక టీజీటీడీసీ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న సౌండ్ అండ్ లైట్స్ షోను వీక్షించి వెళ్తున్నారు.
– ఖిలావరంగల్, ఫిబ్రవరి 9
ఓరుగల్లు కోటలోని కీర్తితోరణాల మధ్య ఇండియన్ ఆయిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న ఫసాడ్ (ఇల్యుమినేషన్ లైట్స్ అండ్ సౌడ్ షో) లైట్లను గత ఏడాది మార్చి 7న నాటి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి కొండా సురేఖతో కలిసి ప్రారంభించారు. 363 లైట్లు, 5 ప్రొజెక్టర్లతో రూపొందించిన షోకు రూ. 5 కోట్లు వ్యయం చేశారు. ప్రారంభం రోజున ఈ ప్రదర్శన ను తిలకించిన అతిథులు, ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. కాకతీయుల ప్రాశస్త్యాన్ని, చరిత్రను తెలిపేలా శాశ్వతంగా కార్యక్రమం ఏర్పాటు చేయాలని మంత్రి కిషన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
అయితే ఎన్నికల కోడ్ వస్తుందనే సమాచారంతో అసంపూర్తిగా ఉన్న ఫసాడ్ లైట్లను అధికారులు ఆగమేఘాల మీద సిద్ధం చేయడంతో మంత్రులు ప్రారంభించారు. 11 నెలలైనప్పటికీ లైట్స్ అండ్ సౌండ్ షోను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడంలో అధికారులు విఫలమయ్యారు. గోల్కొండ కోటలో రంగు రంగుల లైట్ల తో కనువిందు చేస్తున్న షోకు మించి ఖిలావరంగల్లో ఉంటుందన్న విస్తృత ప్రచారంతో పర్యాటకులు, చరిత్రకారులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. అయి తే లైట్స్ షో లేదని తెలియడంతో అధికారులు, ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పని చేయనప్పుడు ప్రచారం ఎందుకంటూ విమర్శిస్తున్నారు. చేసేదేమీ లేక టీజీటీడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లైట్స్ అండ్ సౌండ్ షోను వీక్షించి వెళ్తున్నారు.
కీర్తి తోరణాల మధ్యలో కోట్లాది నిధులతో ఏర్పాటు చేసిన లైట్లు, ప్రొజెక్టర్ల నిర్వహణను కేంద్ర పురావస్తు శాఖ గాలికొదిలేసింది. ప్రదర్శనే లేనప్పుడు నిర్వహణ ఎందుకనుకున్నారో.. ఏమో.. పట్టించుకోవడం మానేశారు. దీంతో ఎంతో విలువైన యంత్ర సామగ్రి, లైట్లు, ప్రొజెక్టర్లలో పిచ్చుకలు గూళ్లు పెట్టుకుంటున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ప్రారంభం రోజునే అటకెక్కించిన లైట్స్ షోను పర్యాటకుల ముందుకు తీసుకురావాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.