తాడ్వాయి, డిసెంబర్ 7: అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేనితనంతో విలువైన భూమిని అక్రమార్కులు చెరబట్టారు. మట్టి తవ్వకాలతో పచ్చని చెట్లను కూల్చివేస్తూ నరిగెబందం గుట్టను బొందలగడ్డగా మారుస్తున్నారు. పట్టించుకోవాల్సిన రెవె న్యూ, దేవాదాయశాఖ అధికారులు తమకేమీ తెలియదన్నట్లు ప్రవర్తిస్తుండడంతో రోజూ వందలాది టిప్పర్లతో గుట్టను తవ్వి మట్టిని తరలించుకుపోతున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. ఈ మహాజాతరకు పెరుగుతున్న భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం సమ్మక్క, సారలమ్మ దేవాలయం ఆధ్వర్యంలో భవనాల నిర్మాణానికి, భవిష్యత్ అవసరాల కోసం మేడారం గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిగూడెం సమీపంలో ఉన్న 29ఎకరాల నరిగెబందం గుట్టను దేవాదాయశాఖకు కేటాయించింది.
కాగా, 2026లో జరిగే మహాజాతరకు గద్దెల విస్తరణతో పాటు జాతర పరిసరాల్లోని రోడ్ల విస్తరణకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు కేటాయించింది. గద్దెల విస్తరణకు మట్టి అవసరముండడంతో అధికారులు నరిగెబందం గుట్ట నుంచి తీసుకోవాలని అనుమతులిచ్చారు. దీన్ని ఆసరాగా చేసుకొని మేడారంలో జరిగే ప్రతి అభివృద్ధి పనికి ఈ గుట్ట నుంచే మట్టిని తరలిస్తుండడంతో విలువైన భూమి బొందలుగా మారడంతో పాటు అడ్డుగా వచ్చిన భారీ వృక్షాలను సైతం నేలకూలుస్తూ మట్టిని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత దేవాదాయశాఖ, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో విలువైన భూమి బొందలగడ్డగా మారుతున్నది.
ఇంతలా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని తెలిసినా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదనే అనుమనాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇన్చార్జి తహసీల్దార్ సురేష్‌బాబును వివరణ కోరగా దేవాదాయశాఖ అధికారుల అనుమతి మేరకే మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. తాను ఎలా అనుమతి ఇస్తానని రెవెన్యూ అధికారులే ఇచ్చారని మేడారం జాతర కార్యనిర్వాహక అధికారి వీరస్వామి పేర్కొన్నారు. ఇలా రెండు శాఖల అధికారులు నేను కాదంటే.. నేను కాదని దాటవేస్తున్నారు. అధికారుల పట్టింపులేనితనంతో అక్రమార్కులు రెచ్చిపోయి రెండు నెలలుగా అక్రమంగా మట్టి తవ్వకాలను సాగిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.