సుబేదారి, జనవరి 5 : వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులు పోస్టింగ్‌లు ఇప్పించిన అధికార పార్టీ నేతలకు తలొగ్గి ఆర్డర్ తప్పి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి కుమారుడి అక్రమ ఇసుక వసూళ్ల దందాకు వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు పోలీసు స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న ఆఫీసర్లు ముందుండి పుల్ సపోర్ట్ చేయడంతో వారి వసూళ్ల దందా జోరుగా సాగుతున్నది. ఆకేరు వాగు పరీవాహక ప్రాంతాలైన వర్ధన్నపేట మండలం ఇల్లంద, కొత్తపల్లి, ల్యాబర్తి, ఐనవోలు మండలం నందనం, పర్వతగిరి మండలం రోళ్లకల్లు శివారు తండా నుంచి రోజుకు సుమారు 200 నుంచి 300 ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్ర మ రవాణా జరుగుతున్నది.
దీనిపై కన్నేసిన సదరు అధికార పార్టీ నేత తనయుడు నెల వారీగా ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ. రెండు వేల చొప్పున వసులు చేయడానికి కట్య్రాల, ల్యాబర్తి, ఇ ల్లంద, నందనం నుంచి ఒక్కొక్కరినీ వసూళ్ల కోటరీని పెట్టుకున్నాడు. ఇందులో భాగంగా కట్య్రాలలో నెలవారీ మామూళ్ల కోసం ‘ఫోన్‌పే కొడ్తవా.. క్యాష్ తెస్తవా.. ఇయ్యాల లాస్ట్ రోజు.. ఆయన బండి ఆపితే ఏం సమా ధానం చెప్పలేం.. మూడు రోజుల బట్టి ఏమైందని (అధికార పార్టీ నేత తనయుడు) టార్చర్ పెడుతుండు..అర్థం చేసుకోండి’ అని ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్లకు వచ్చిన ఆ డియో హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో అధికార పార్టీ నేత తనయుడి అక్రమ వసూళ్ల దందాకు వర్ధన్నపేట, ఐనవోలు, పర్వతగిరి పోలీసు అధికారుల ఫుల్ సపోర్ట్ ఉన్నట్లు స్పష్టమవుతున్నది.
ప్రతి నెలలో అనుకున్న డేట్ ప్రకారం తప్పనిసరిగా సదరు నేత కుమారుడికి ఒక్కో ట్రాక్టర్ నుంచి ఓనర్ లేదా డ్రైవర్ పక్కాగా రూ. 2వేలు ఇవ్వాల్సిందే. లేదంటే ఏరియా అనుచర కోటరీ వ్యక్తి నుంచి డబ్బులివ్వని ట్రాక్టర్‌ను సీజ్ చేయాలని స్థానిక పోలీసు అధికారికి సమాచారం వె ళ్తుంది. వెంటనే సిబ్బంది సంబంధిత ట్రాక్టర్ వద్దకు వచ్చి సార్ రమ్మన్నాడు.. వచ్చి మాట్లాడు కోండని ఓనర్‌కు హెచ్చరికలు జారి చేస్తాడు. తప్పనిసరి పరిస్థితిలో ఓనర్లు వెంటనే ఫోన్‌పే లేదా, క్యాష్ ఏరియా కలెక్షన్ వ్యక్తికి అందజేసే ప్రక్రియ జరుగుతుంది. వారం దాటినా మామూళ్లు ఇ వ్వని ట్రాక్టర్లకు ఆ మూడు పోలీసు స్టేషన్ల అధికారులు సీజ్ చేసి, ఓనర్లను కేసులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారు లు విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని వారు చెబుతున్నారు.