జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జల్లాలో మొరం మాఫియా కోరలు చాస్తున్నది. అక్రమార్కులు పట్టపగలే బరి తెగిస్తున్నారు. జేసీబీలతో యథేచ్ఛగా గుట్టల్లోని మొరాన్ని ట్రాక్టర్లు, లారీల ద్వారా తరలించి అమ్ముకుంటున్నారు. ఇటీవలి కాలం లో ఈ దందా మరీ ఎక్కువైంది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కమర్షియల్‌గా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే వేలాది టన్నుల మొరం బ్లాక్ మార్కెట్‌కు తరలగా రూ.లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. అయినా, అటు రెవెన్యూ, ఇటు మైనింగ్ శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ దందా పెద్దల కనుసన్నల్లో జరుగుతుండడంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకడుగు వేస్తు న్నట్లు ప్రచారం జరుగుతున్నది. జిల్లాలోని చిట్యాల మండలం నవాబుపేట రెవెన్యూ శివారు గుట్టల్లో జరుగుతున్న ఈ భారీ మొరం దందా అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నది.
నవాబుపేట రెవెన్యూ పరిధిలోని శాంతినగర్ సమీప గుట్టల్లో అక్రమ మొరం దందా రూ. లక్షల్లో కొనసాగుతున్నది. ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టల్లోని మట్టిని లూటీ చేస్తున్నారు. గుట్టల చుట్టూ సుమారు 30 ఎకరాల్లో అక్రమార్కులు జేసీబీలతో మొరాన్ని పట్టపగలే తరలిస్తున్నా రు. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా తరలిస్తుంటే పట్టించుకునేవారు కరువయ్యారు. ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ అవసరాల పేరుతో ఒక్కో ట్రాక్టర్ మొరాన్ని రూ. 1000 నుంచి రూ. 2000 వరకు కమర్షియల్‌గా విక్రయిస్తున్నారు.
ఇలా ట్రాక్టర్ల ద్వారా నిత్యం మొరం రవాణా నాన్‌స్టాప్‌గా జరుగుతున్నా అధికారు లు ఒక్క వాహనాన్ని కూడా సీజ్ చేసిన దాఖలాలు లేవు. అలాగే గిద్దెముత్తారం సమీప గుట్టల్లో నుంచి సైతం మొరం అక్రమ రవాణా జోరుగా జరు గుతున్నది. గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే కోసం నేషనల్ హైవే అధికారులు గిద్దె ముత్తారం గుట్టల్లో నుంచి 10 వేల టన్నుల మొరం కోసం మైనింగ్‌శాఖకు దరఖాస్తు చేసుకోగా అధికారులు అనుమ తినిచ్చారు. ఆగస్టు 28న అనుమతి ఇవ్వగా సెప్టెంబర్‌తో గడువు పూర్తయింది. మరోమారు దరఖాస్తు చేసుకున్నా అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఈ అక్రమ మొరం దందా వెనుక ఇద్దరు అధికార పార్టీ నేతలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది.
నవాబుపేట రెవెన్యూ పరిధిలోని గుట్టల నుంచి మొరం తరలింపునకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. 241 సర్వే నంబర్ నుంచి మొరం తరలిస్తే అడ్డుకున్నాం. రాత్రి సమయాల్లో మొరం తరలిస్తున్నారు. పగలు తరలిస్తే అడ్డుకుంటున్నాం. అడిగితే ఇందిరమ్మ ఇండ్ల కోసం అని చెబుతు న్నారు. గుట్టలకు గతంలో పాస్ పుస్తకాలు వచ్చాయి. పట్టా భూముల్లో నుంచి మొరం తీయాల న్నా రెవెన్యూ, మైనింగ్ శాఖ అనుమతి తీసుకోవాల్సిందే. ఈ విషయమై మైనింగ్ ఏడీ జయరాజ్ ను వివరణ కోరగా.. తాము గుట్టల్లో నుంచి మొరం తరలింపునకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. నేషనల్ హైవేకు మాత్రం గిద్దె ముత్తారం గుట్టల్లో నుంచి 10 వేల టన్నులకు అను మతి ఇచ్చామన్నారు.
– ఇమాం బాబాషేక్, తహసీల్దార్, చిట్యాల
అక్రమార్కులు అధికారులను మేనేజ్ చేసుకుంటూ మట్టి, మొరంను నవాబుపేట, గిద్దెముత్తా రం గుట్టల్లో నుంచి రాత్రింబవళ్లు తరలిస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్, ఫారెస్టు అధికారు లు స్మగ్లర్లకు సపోర్టు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కళ్ల ముందే లక్షలాది రూపాయల విలువైన మొరం, మట్టి అక్రమంగా తరలివెళ్తుంటే పట్టించుకునేవారు కరువయ్యారు. ఆంధ్రాకు చెందిన కాంగ్రెస్ నేతకు చెందిన కంపెనీలపై ఆనాడు పట్టాలు చేశారు. అనంతరం ఆ భూములు ఇంకా ఎవరి పేర్లకు మారాయో అధికారులు తెలుపాలి. ఈ విషయమై విచారణ జరపాలి. పట్టా భూములైతే అనుమతి లేకుండా అక్రమంగా రవాణా ఎలా చేస్తారు.
– మారెపల్లి మల్లేశ్, సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) జిల్లా కార్యదర్శి
చిట్యాల మండలంలోని శాంతినగర్ గుట్టలకు పట్టాలు సృష్టించారు. గుట్టల వద్ద సుమారు 80 ఎకరాల్లో పట్టా పాస్ బుక్కులు పొందారు. ఇందులో కొంతమంది పంటలను సాగుచేస్తుండగా చాలా వరకు గుట్ట భూముల్లో ఎలాంటి పంట లు వేయకపోగా అందులో నుంచి మొరం రవాణా జరుగుతున్నది. పలు సర్వే నంబర్లలో గుట్టలకు పట్టాలు ఎలా వచ్చాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరి పేరున పదుల ఎకరాల్లో పట్టాలయ్యాయి. తమది పట్టా భూమి అని, ఎవరి అనుమతి అవసరం లేదన్నట్లు మొరంను ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారు. రెవెన్యూ, మైనింగ్‌శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలనే సోయి మరిచి పట్టపగలే అధికారుల కార్యాలయాఅ, పోలీస్ స్టేషన్ ముందు నుంచే దర్జాగా అక్రమార్కులు దందా కొనసాగిస్తున్నారు. ఇదే గుట్టల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐరన్ ఓర్ కోసం యంత్రాలు ఏర్పాటు చేసి ఆంధ్రాకు తరలించారు. అనంతరం జరిగిన ఆందోళనల నేపథ్యంలో ఈ దందాకు తెరపడింది. ఆనాడు ఆంధ్రాకు చెందిన ఓ మహిళా నేత తన బినామీ పేర్లపై ఈ గుట్టపై పట్టాలు చేసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.