భూ భారతి ప్రాజెక్టులో పైలట్‌గా ప్రకటించిన వెంకటాపూర్ మండలంలోని అసైన్డ్ భూముల్లో అడ్డగోలు దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2004లో కాంగ్రెస్ సర్కారు హయాంలో జవహర్‌నగర్, లింగాపూర్ కేంద్రంగా ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఎక్కడ ఉన్నాయో తెలియనప్పటికీ అక్రమార్కులు వాటికి పట్టాలు చేయించుకొని దర్జాగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అనుభవిస్తున్నారు. కాస్తులో ఉన్న రైతులకు పట్టాలు లేకపోగా వ్యవసాయం చేయని వారు అదే సర్వే నంబర్లలో పట్టాలు పొంది 15 ఏండ్లుగా ప్రజల సొమ్మును మింగుతున్నారు. ఈ అక్రమాల బాగోతాన్ని చూసి రెవెన్యూ అధికారులు సైతం నోళ్లు వెల్లబెడుతున్నారు.
– ములుగు, మే 28 (నమస్తే తెలంగాణ)
భూ భారతి ప్రాజెక్టులో భాగంగా ఏప్రిల్ 18వ తేదీన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కలు వెంకటాపూర్‌ను పైలట్ మండలంగా ప్రకటించి భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఈ మండలంలో అసైన్డ్, పట్టా భూములను అక్రమంగా పట్టాలు చేసుకున్న వైనం ఒక్కొక్కటికిగా బయట పడుతున్నది. 200 4లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మండలంలోని జవహర్‌నగర్, లింగాపూర్ కేంద్రంగా ప్రభుత్వ, అసైన్డ్ భూములను అక్రమార్కులు అందిన కాడికి దండుకున్నారు. రైతుల మాదిరిగా బ్యాంకుల నుంచి రుణాలు పొందుతూ రుణ మాఫీ పథకాన్ని కూడా వర్తింపజేసుకున్నారు. భూ భారతి చట్టంలో భాగంగా కాస్తులో ఉన్న రైతులు పట్టా కావాలని కోరుతూ అధికారులకు ఇటీవల దరఖాస్తులు చేయడంతో సదరు భూమికి గతంలోనే పట్టా పొంది ఉన్న వారి పేర్లు తొలగించేందుకు రెవెన్యూ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భూ భారతితో బట్టబయలవుతున్న అక్రమాలు
గతంలో ప్రభుత్వ భూములను పట్టాలు చేసుకున్న అక్రమార్కులు ప్రస్తుతం అవి ఎక్కడ ఉన్నాయో సర్వే నిర్వహించాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అధికా రులు, అక్రమార్కులు సదరు భూముల వద్దకు వెళ్లగా అప్పటికే కాస్తులో ఉన్న రైతులు ఎదురు తిరగడంతో గొడవలు జరుగుతున్నాయి. అసైన్డ్ పట్టా ఇచ్చే క్రమంలో లబ్ధిదారులకు భూమిని చూపించి పట్టాలు మంజూరు చేయాల్సి ఉండగా అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వ భూమిని అక్రమార్కులకు రాసి ఇచ్చి ముడుపులు తీసుకున్నారు. చట్టం ప్రకారం పట్టా పొందిన తర్వాత రెండేళ్ల లోపు భూమిని సాగు చేసుకోని క్రమంలో నిబంధనల మేరకు ప్రభుత్వం స్వా ధీనం చేసుకోవాల్సి ఉంటుంది.
దీంతో పాటు వెంకటాపూర్‌కు చెందిన పట్టా భూములు కొందరికి జవహర్ నగర్ పరిధిలో ఉండగా ఆ భూములను సైతం కొందరు అక్రమంగా పట్టాలు చేసుకొని విక్రయాలు సైతం జరిపారు. అసలు పట్టాదారులు అమ్మకున్నా, సాగులో, మోకా మీద లేకున్నా సదరు భూములను అక్రమార్కులు వారు, వారి కుటుంబ సభ్యుల పేరు మీద పట్టాలు చేయించుకొని ఇతరులకు అమ్మకాలు సైతం జరిపారు. లక్ష్మీదేవిపేట, నల్లగుంట గ్రామాల్లో సైతం ఇలాంటి అక్రమ పట్టాల బాగోతం ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఈ విషయమై వెంకటాపూర్ తహసీల్దార్‌ను వివరణ కోరగా భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదుల ప్రకారం ప్రభుత్వ భూములు అని తేలితే విచారణ చేస్తామన్నారు. ప్రభుత్వ భూములను కొనుగోలు చేసిన వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు.
రెండు గ్రామాల్లో దందా..
నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లింగాపూర్ గ్రామం జవహర్‌నగర్‌లో విలీనం కాగా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత లింగాపూర్ కూడా నూతన గ్రామపంచాయతీగా అవతరించింది. ప్ర స్తుతం ములుగు జిల్లాలో ఈ రెండు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఉన్నాయి. భూ భారతిలో భాగంగా ఈ రెండు గ్రామాల నుంచి ఎక్కువ మొత్తంలో పట్టాల కోసం ఫిర్యాదు అందినట్లు తెలుస్తున్నది. 2004లో ములుగు ఆర్డీవో ద్వారా అక్రమంగా తమ కుటుంబ సభ్యుల పేరుపై పట్టాలు పొందిన పలువురికి భూమి ఎక్కడ ఉన్నదో తెలియనప్పటికి ఇందిరా జల ప్రభ పథకంతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలను పొందుతూ వస్తున్నారు.