రాయపర్తి, ఫిబ్రవరి 15 : అధికార దర్పంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు అక్రమ కేసులు నమోదు చేయించడం సరికాదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. రాయపర్తి మండలం మైలారం లో ఈనెల 13న రాత్రి గ్రామదేవతలు దుర్గామా త, మారెమ్మల ఉత్సవాల్లో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి బోనం ఎత్తుకుని మా రెమ్మ ఆలయానికి వెళ్తున్న క్రమంలో గ్రామానికి చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, రంగు కుమార్, బిల్ల సుధీర్‌రెడ్డి, ఈదులకంటి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇరు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై తాము ముందు వెళ్తామంటే తాము వెళ్తామం టూ ఘర్షణకు దిగారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకొని, వాగ్వాదానికి దిగడంతో స్థానిక ఎస్సై కొంగ శ్రవణ్‌కుమార్, సిబ్బంది వారి కి నచ్చజెప్పి ఎమ్మెల్యేను అక్కడినుంచి పంపించేశారు. అయితే ఉత్సవాలకు రాకుండా ఎమ్మెల్యేను అడ్డుకున్నారంటూ అధికార పార్టీ నేతలు చేసిన ఫిర్యాదుతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలు లేతాకుల మధూకర్‌రెడ్డి, బైరు యాకన్న, కోల సంపత్, గబ్బెట అనిల్కుమార్లను శనివా రం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విష యం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి.. బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మైలారంలో జరిగిన గొడవ, బీఆర్ఎస్ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారో అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతగాక ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ రాక్షసానందం పొందుతున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. అధికార దర్పంతో ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ఘర్షణకు దిగిన కాంగ్రెస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఎర్రబెల్లి ప్రశ్నించారు. పోలీసులు ఇప్పటికైనా ఏకపక్ష వైఖరి మానుకోవాలని ఆయన కోరారు. ఇక్కడ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, మండల ఇన్చార్జి పల్లా సుందర్ రాంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, మండల నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, సంది దేవేందర్‌రెడ్డి, గుడి మైబురెడ్డి ఉన్నారు.