ములుగు, సెప్టెంబర్ 13(నమస్తేతెలంగాణ) : ప్రజాపాలనలో ప్రశ్నించడమే తప్పుగా పరిగణిస్తూ బీఆర్ఎస్ నాయకులను ఎక్కడిక్కడ పోలీసులతో కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులు చేయించడం సరైంది కాదని జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు జిల్లాకేంద్రంలోని తన ఇంటి నుంచి నాయకులతో కలిసి హైదరాబాద్‌కు బయల్దేరుతున్న ఆమెను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
విషయం తెలుసుకున్న కార్యకర్తలు ఆమె నివాసానికి చేరుకున్నారు. అరెస్టులను నిరసిస్తూ ప్లకార్డులను చేతపట్టుకొని పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలు మారిన ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేయడం సరికాదన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా రోజుకో కొత్త డ్రామాకు తెరతీస్తూ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు మల్క రమేశ్, శ్రీనివాస్‌రెడ్డి, సానికొమ్ము రమేశ్‌రెడ్డి, పోరిక విజయ్రామ్నగర్, వేములపల్లి భిక్షపతి, దుర్గం రమణయ్య, బైకాని సాగర్, గొర్రె సమ్మయ్య, ఆకుతోట చంద్రమౌళి, గండి కుమార్, గరిగె రఘు, అన్న తిరుపతి, స్వరూప ఉన్నారు.