హనుమకొండ/వరంగల్, నవంబర్ 6 : ఎలాంటి ఆర్డర్ కాపీ లేకుండా కుటుంబ, కుల గణన సర్వే చేయమనడం సరైంది కాదని, ఇందులో తాము పాల్గొనమని ఐకేపీ పట్టణ ఆర్పీలు స్పష్టం చేశారు. ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం హనుమకొండ కలెక్టరేట్, బల్దియా కమిషనర్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా ఆర్పీలు మాట్లాడుతూ కుల గణన సర్వే చేయాలంటే ఆర్డర్ కాపీ ఇచ్చి వేతనం నిర్ణయించాలన్నారు. ఈ విషయంలో కలెక్టర్ తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బకాయి వేతనాలు తక్షణమే ఇవ్వాలని, కనీస వేతనం, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 164 జీవోను తొలగించడంతో పాటు ఆర్పీలకు రూ. 26వేల వేతనం ఇస్తూ, అంద రికీ గుర్తింపు కార్డులు, ఏడాదికి నాలుగు జతల యూనిఫాం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబ, కుల సర్వేకు ఆర్పీలకు స్థానిక డివిజన్లలో కాకుండా గ్రేటర్లోని వేరే ప్రాంతాల్లో డ్యూటీలు వేయడంతో ఆర్పీలు సర్వేకు వెళ్లేది లేదని మొండి కేశారు.
తమ గోడును కమిషనర్ అశ్విని తానాజీ వాకడేకు చెప్పుకునేందుకు వస్తే తమను పట్టించుకోకుండా వెళ్లడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మేయర్ గుండు సుధారాణిని కలవగా అధికారులతో చర్చించి వారి డివిజన్లలోనే డ్యూటీలు వేసేలా చర్యలు తీసుకోవాలని అదేశించారు. తొలి రోజు గ్రేటర్లోని 66 డివిజన్లలో జరిగిన సర్వేకు ఆర్పీలు దూరంగా ఉన్నారు. వరంగల్ ప్రాంతంలో వారు మెటీరియల్ సైతం తీసుకోకపోవడం గమనార్హం. కార్యక్రమంలో డీ సునీత, ఎం శ్రీదేవి, ఝాన్సీ రాణి, సరస్వతి, నిడిగొండ రజిత, నాగమణి, ధనలక్ష్మి, విజయ రాణి, విజయ, సుజా త తదితరులు పాల్గొన్నారు.