ఖిలావరంగల్: సంగారెడ్డి జిల్లా పాష మైలారంలో జరిగిన దుర్ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మంగళవారం భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ఏవోను కలిసి వినతి పత్రం అందజేశారు. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనలో ఇప్పటికీ నేటికీ 40 మందికి పైగా మరణించారని అనేకమందికి తీవ్ర గాయాలు అయ్యాయని ఇంకా కొంతమంది జాడ తెలియడం లేదని తెలిపారు. రసాయనిక ఫ్యాక్టరీలలో తగిన జాగ్రత్తలు భద్రత సౌకర్యాలు తీసుకోకపోవడం వలన ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రైవేటు ఫ్యాక్టరీలపై కార్మిక శాఖ అధికారులు ఫ్యాక్టరీ లలో సరైన సౌకర్యాలు ఉన్నాయా అని పర్యవేక్షణ చేసే ప్రభుత్వ ఇన్స్పెక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు. ఫ్యాక్టరీ యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, మరణించిన వ్యక్తి కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని, క్షతగాత్రులైన కార్మిక కుటుంబాలకు కార్మికులకు 50 లక్షలు ఇవ్వాలని గాయపడిన కార్మికులందరికీ కార్పొరేట్ వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వినతి పత్రం ఇచ్చిన వారిలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్, నగర కార్యదర్శి ఎర్ర జయబాబు, అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు, పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్, మన్నె కరుణాకర్, కర్రు ఐలయ్య తదితరులు ఉన్నారు.