Development | హనుమకొండ చౌరస్తా, జూన్ 20: ఈ నెల 22న జరిగే ఆవోపా ఎన్నికలలో గెలిపిస్తే సేవే లక్ష్యంగా ఆవోపా అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా ఆవోపా అధ్యక్ష అభ్యర్థి దొంతుల ఈశ్వరయ్య తెలిపారు. 2025-27 సంవత్సరానికి గాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఈశ్వరయ్య మాట్లాడుతూ తాను కాకతీయ విశ్వవిద్యాలయంలో 1992 నుండి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి 2018వ సంవత్సరంలో పదవి విరమణ పొందడం జరిగిందని,1980- 83 సంవత్సరాలలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లలో సహాయ కార్యదర్శిగా, కార్యదర్శిగా పని చేయడం జరిగిందని తెలిపారు.
కాకతీయ విశ్వవిద్యాలయ దూర విద్యా కేంద్రం ఉద్యోగ సంఘాలలో వివిధ హోదాలలో పనిచేసి, వివిధ జాతీయ, ప్రాంతీయ సేవా సంఘాలలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నానని, గతంలో అవోపా హనుమకొండ కార్యవర్గంలో కార్యవర్గ సభ్యునిగా, ఉపాధ్యక్షునిగా పని చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఆర్యవైశ్య మహాసభ సీనియర్ సిటిజన్ విభాగానికి చైర్మన్ గా పని చేస్తున్నానని, అవోపా మిలీనియం ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్, అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ మెంబరుగా, వాసవి క్లబ్ మెంబర్గా ఉన్నట్లు తెలిపారు.అవోపా అధ్యక్షునిగా ఎన్నికైతే అవోపా వివాహ పరిచయ వేదికను బలోపేతం చేస్తూ ఆన్లైన్లోనే కాకుండా ప్రత్యక్ష రిజిస్ట్రేషన్లు చేస్తూ వివాహ పరిచయ వేదికలను నిర్వహిస్తానని, అవోపాభవనంలో ఉన్నపై అంతస్తులను సద్వినియోగంలోకి తీసుకువచ్చి ఆదాయం పెంపొందిస్తూ అవోపాను ఆర్థికంగా బలోపేతం చేస్తానని తెలిపారు.
ప్రతీ నెల కార్యవర్గ సభ్య మీటింగ్ పెట్టి కార్యక్రమాల వివరాలను, కొత్త కార్యక్రమాల రూపకల్పన, ఆదాయ వ్యయాలను చూపిస్తూ అందుబాటులో ఉంటానని తెలిపారు. మెడికల్ క్యాంపులను నిర్వహించడం, ఉన్న కార్పొరేషన్లను బలోపేతం చేస్తూ, మరో 2 కార్పొరేషన్ నిర్వహించడానికి కృషి చేస్తూ ఆదాయాన్ని పెంచడం, ప్రభుత్వం తరఫున ఆర్థిక నిధులను మంజూరు చేయించడానికి కృషి చేస్తూ అర్యవైశ్యులకు ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఒక న్యాయస్థాన మీడియేషన్ సెంటర్ ను నెలకొల్పుతానని, విద్యార్థులకు కెరియర్ గైడెన్స్, కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంపొందించుటకు మేధావులచే శిక్షణ ఇప్పిస్తూ ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పుతానని, పేద ఆర్యవైశ్య విద్యార్థులకు ఆర్థిక సహాయం కొరకు కృషి చేయడం, మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందజేస్తామని తెలిపారు. అలాగే ఉద్యోగ పదోన్నతి, విరమణ పొందిన అవోపా సభ్యులకు సన్మానించి గౌరవించడం,సమాజంలో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులు అందించడం,అర్యవైశ్య సభ్యుల సమాజ అభివృద్ధి కొరకు సేవలను అందిస్తూ, విహారయాత్రలు, వనభోజనాలను నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేపడుతానని హామీ ఇచ్చారు. ఈ నెల 22న జరిగే ఆవోపా జిల్లా ఎన్నికలలో అధ్యక్షుడిగా తనను అధిక మెజారిటీతో గెలిపించాలని దొంతుల ఈశ్వరయ్య కోరారు.