మహదేవపూర్ (కాళేశ్వరం), మే 19 : సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తజనంతో కాళేశ్వరం కిటకిటలాడుతోంది. ఐదో రోజు సోమవారం తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ ప్రాంతాల చెందిన లక్షకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుష్కర స్నానం చేశారు. మాజీ మంత్రి, మలాజిగిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రూనాయక్ పుణ్యస్నానం చేసి కాళేశ్వర-ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
నది ఒడ్డున పలువురు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. సరస్వతీ మాతను దర్శించుకొని పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.
వీఐపీ ఘాట్ నుంచి త్రివేణి సంగమానికి ఇసుకపై తగినన్ని క్వయ్యర్ మ్యాట్లు ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. పోలీస్‌లు, అధికారులు వీఐపీల సేవలో తరిస్తూ సామాన్యులను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీ ఘాట్ వద్ద పలువురు పోలీసులు భక్తులపై దురుసుగా ప్రవర్తించి చేయిచేసుకోవడం చర్చనీయాంశమైంది.
ఏర్పాట్లు ఏం బాగాలేవు
పుషరాల ఏర్పాట్లు బాగా లేవు. ఇకడ సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదు. ఆలయ ఆవరణలో సీసీపై మ్యాట్లు వేయకపోవడం వల్ల ఎండ వేడికి కాళ్లు మండుతున్నాయి. చిన్న పిల్లలు, పెద్దవాళ్లు ఎలా తట్టుకుంటారు. ఏర్పాట్లు ఇంత దారుణంగా ఉంటాయనుకోలేదు.
– మాధురి, ఖమ్మం
సామాన్యులను పట్టించుకుంటలేరు..
పుషరాలకు వచ్చే సామాన్య భక్తులను అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. వేసవి దృష్ట్యా తగిన ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. భక్తులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సరికాదు. అధికారుల సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
– అరవింద్, బసంత్‌నగర్, పెద్దపల్లి జిల్లా
అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ఆలయాలపై లేదు
రాష్ట్ర ప్రభుత్వానికి అందాల పోటీపై ఉన్న శ్రద్ధ.. ఆలయాల అభివృద్ధిపై లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం కాళేశ్వరానికి వచ్చిన సంజయ్ దంపతులు పుణ్య స్నానాలు ఆచరించి నదీమాతకు పూజలు చేశారు. స్వామివారి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుషరాలకు ప్రభుత్వం రూ.35 కోట్లు మాత్రమే కేటాయించిందని, ఆ నిధులు ఎటు సరిపోవన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధికి కోట్లాది రూపాయలు ప్రకటించి తక్షణమే విడుదల చేశారని గుర్తు చేశారు. ఇటీవల కాళేశ్వరానికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి రూ.200 కోట్లు ప్రకటించారని, ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దర్శనం త్వరగా అయ్యేలా చూడాలి : కలెక్టర్ రాహుల్‌శర్మ
భక్తులు త్వరగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. సరస్వతీ ఘాట్, సమాచార కేంద్రంతో పాటు ఆలయాన్ని సందర్శించారు. ఘాట్ల వద్ద వ్యర్థాలను తొలగించి పరిశుభ్రత పాటించాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.