మంగపేట, మే 11 : పాకిస్తాన్ ఉగ్రవాదులపై వీరోచితంగా పోరాటం చేసిన భారత్ జవాన్లకు సంఘీభావం ప్రకటిస్తూ ములుగు జిల్లా మంగపేట మండలంలో ఆదివారం సుమారు 500 మంది భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జై జవాన్ నినాదాన్ని మార్మోగించారు. ములుగు జిల్లా సరిహద్దు గ్రామం అకినేపల్లి మల్లారం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రాజుపేట, రమణక్కపేట, వాడగూడెం, పాలాయిగూడెం, బెస్తగూడెం, మల్లూరు, బోరునర్సాపురం, మంగపేట మీదుగా కమలాపురం వరకు(దాదాపు 35 కి.మీలు) సాగింది.
ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన సంతాప సూచక నినాదాలు, భారత సైనికులకు సంఘీభావ నినాదాలు చేస్తూ ఎండను లెక్కచేయకుండా ర్యాలీ కొనసాగించారు. ర్యాలీలో కుల మతాలు, రాజకీయాలకతీతంగా ఆయా గ్రామాల యువకులు, గ్రామ పెద్దలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.