హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 9 : గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయి తుది నియామకాలు మాత్ర మే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమయంలో ఫలితాలను రద్దు చేయడంతో అర్హత సాధించిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు నిరుద్యోగులు, గ్రూప్-1 మెయిన్స్ ఉత్తీర్ణులు కాని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, మెయిన్స్ పరీక్ష పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించడంతో అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. గ్రూప్-1 పరీక్షల వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ.. కొందరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని సూచించింది. పునఃమూల్యాంకనం సాధ్యంకాకపోతే 8 నెలల్లో మళ్లీ మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో రీవాల్యుయేషన్ చేయించాలని కొందరు. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సీబీఐతో విచారణ జరిపించాలి
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చెంపపె ట్టు. దీనిపై సీబీఐ ఎంక్వైరీకి డిమాం డ్ చేస్తున్నాం. నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగా టం ఆడుతున్నది. వెంటనే టీజీపీఎస్పీ బోర్డును రద్దు చేయాలి. గ్రూప్-1 పరీక్షల పూర్తి ఎపిసోడ్‌పై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలి. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ యువత ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలి.
– మాచెర్ల రాంబాబు, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి
రీఎగ్జామ్స్ నిర్వహించాలి
రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం జరిగింది. గ్రూప్-1 లాంటి రాష్ట్రస్థాయి పరీక్షలల్లో ఇంగిష్ మీడియం అభ్యర్థులకు ఎకువ మారులు వేశారు. దీంతో తెలుగు మీడియం అభ్యర్థుల్లో 563 పోసుల్లో కేవలం 50 మందిని సెలక్ట్ చేశారు. ఒకే సెంటర్ నుంచి ఎకువ అభ్యర్థులను సెలక్ట్ చేయడం, రూల్స్‌కు విరుద్ధంగా జెల్ పెన్ను ఉపయోగించడం వంటి అంశాలు తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం చేకూర్చాయి. అభ్యర్థుల తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ రచనరెడ్డి, తీర్పును వెలువరించిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ప్రత్యేక కృతజ్ఞతలు.
– బీ అనిల్‌కుమార్, గ్రూప్-1 అభ్యర్థి, హనుమకొండ
పరీక్షలు పారదర్శకంగా జరగాలి
తొర్రూరు : గ్రూప్-1 పరీక్షలో పారదర్శకత లేకపోవడం మా భవిష్యత్‌ను చీకటిలో నెట్టేస్తోంది. సంవత్సరాల పాటు చదివి, లక్షల రూపాయలు ఖర్చు చేసి, మా కుటుంబాల నుంచి దూరంగా పట్నా లకు వెళ్లి శిక్షణ తీసుకున్నాం. పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు రాత్రింబవళ్లు శ్రమించి, వసతి గృహాల్లో కష్టాలు పడుతూ పరీక్షలకు సిద్ధమవుతున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం నిబంధనలు పాటించకుండా, తప్పులు చేస్తూ మమ్మల్ని నట్టేట ముంచేస్తోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా గ్రూప్-1 పరీక్షలు నిర్వహించాలి. లేకపోతే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదు.
– పత్తేపురపు చైతన్యకుమార్, తొర్రూరు