నయీంనగర్, నవంబర్ 9 : గడపగడపకూ న్యాయ సేవలందించేలా న్యాయ సేవాధికార సంస్థలు చూడాలని హైకోర్టు న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజయ్‌పాల్ అన్నారు. శనివారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో న్యాయ సేవాధికార సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాథమిక హకులు, విధుల గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉచిత న్యాయ సహాయం అనేది స్వాతంత్య్రం రాక ముందు నుంచే ఉందని అన్నారు.
అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాలు గ్రామాల్లోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని, వారిని వినియోగించుకోవాలని అన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కమ్యూనిటీ మీడియేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, అది సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజల మధ్య వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిషరిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో న్యాయ సేవా సంస్థలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. పూర్వకాలంలో విడాకుల మాట చాలా తకువగా వినేవాళ్లమని, ప్రస్తుతం భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయిందని అన్నారు.
ఇది చాలా బాధాకరమైన విషయం అని, మధ్యవర్తిత్వం ద్వారా భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇప్పించి తిరిగి వారు వైవాహిక జీవితాన్ని కొనసాగించేలా చర్య లు చేపడుతున్నామని వివరించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి(అడ్మినిస్ట్రేషన్ జడ్జి)జస్టిస్ మౌషుమీ భట్టాచార్య వర్చువల్‌గా హాజరయ్యారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి, వరంగల్, హనుమకొండ చైర్మన్లు బీవీ నిర్మలా గీతాంబ, సీహెచ్ రమేశ్‌బాబు, కార్యదర్శులు సాయికుమార్, క్షమాదేశ్ పాండే, కలెక్టర్లు సత్యశారద, ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, జడ్జిలు, రెండు జిల్లాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు తీగల జీవన్ గౌడ్, రమేశ్‌బాబు, బార్ కౌన్సిల్ మెంబర్లు బైరపాక జయకర్, సిరికొండ సంజీవ రావు, ఉమ్మడి జిల్లాల న్యాయవాదులు, డీడబ్ల్యూవో, డీఆర్డీఏ, మెప్మా, సఖీ, భరోసా, బీసీ వెల్ఫేర్, మైనారిటీ, డీఎంహెచ్‌వో, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.