హనుమకొండ, ఏప్రిల్ 18: సమాజంలో వ్యక్తులు, సమూహాల మధ్య వచ్చే వివాదాలను పరిషరించి శాంతియుత సమాజ స్థాపనకు కమ్యూనిటీ పెద్దలు నడుంబిగించాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ పిలుపునిచ్చారు. హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏ వివాదమైనా వ్యక్తికి వ్యక్తి మధ్యనో లేదా వ్యక్తుల సమూహాల మధ్యనో ఏర్పడుతుందన్నారు. అయితే ఆ వ్యక్తి గానీ, సమూహం గానీ ఏదో ఒక కమ్యూనిటీకి చెందినదై ఉంటుందని, అలాంటి పరిస్థితిల్లో అదే కమ్యూనిటీకి చెందిన పెద్దలు వారికి నచ్చచెబితే వివాదాలు శాంతియుత వాతావరణంలో పరిషారమయ్యే అవకాశం ఉంటుందన్నారు.
ఈ బృహత్తర ఆలోచన నుంచి ఉద్భవించినదే కమ్యూనిటీ మీడియేషన్ విధానమన్నారు. మొదటిసారిగా కేరళ రాష్ట్రంలో, ఆ తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా విజయవంతమైందన్నారు. 2023లో వచ్చిన మీడియేషన్ చట్టం ఈ విధానానికి చట్టబద్ధత కల్పించిందన్నారు. ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య తగాదాలు పెరిగిపోతున్నాయని, వీటికి చకటి పరిషారం కమ్యూనిటీ మీడియేషన్ అని అన్నారు. న్యాయస్థానాల్లో కేసులు ఉంటే, ఇరుపక్షాల్లో ఒకరు గెలిస్తే మరొకరు పై కోర్టుకు వెళ్తారని, కానీ, కమ్యూనిటీ మీడియేషన్ విధానంలో వివాదం పరిషారమైతే వ్యక్తులే కాకుండా కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయని, ఇలాంటి గురుతర బాధ్యతను పెద్దలు తమ భుజసంధాల మీద వేసుకోవాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో విశ్రాంత వైస్ చాన్స్‌లర్ కమ్యూనిటీ మీడియేటర్‌గా సాధించిన విజయాలను వివరించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి మాట్లాడుతూ.. నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్‌లో ఈ కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్లు విజయవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. గత ఏప్రిల్ 7వ తేదీన కామారెడ్డిలో ఒకేసారి 12 కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు బీవీ నిర్మల గీతాంబ, సీహెచ్ రమేశ్‌బాబు, ఇతర జిల్లాల న్యాయమూర్తులు, వరంగల్, హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు సాయికుమార్, క్షమాదేశ్‌పాండే పాల్గొన్నారు.