మట్టెవాడ, అక్టోబర్ 3 : మంత్రి కొండా సురేఖ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హీరో నాగార్జున అభిమానులు హెచ్చరించారు. నాగార్జున కుటుంబంపై మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆమె దిష్టిబొమ్మను గురువారం వరంగల్ నగరంలోని పాపయ్యపేట చమన్ సెంటర్లో దహనం చేశారు. ఈ సందర్భంగా అకినేని వంశ అభిమానుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్ మాట్లాడుతూ సురేఖ గౌరవప్రదమైన మంత్రిగా ఉండి నాగచైతన్య-సమంతల విడాకుల విషయమై దిగజారుడు మాటలు మాట్లాడడం విచారకరమన్నారు.
వెంటనే అకినేని కుటుంబానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎదురొనే దమ్ములేక సురేఖ స్థాయిని మరిచి నీచమైన మాటలు మాట్లాడడం ఏంటని వారు ప్రశ్నించారు. అర్థంపర్థంలేకుండా మాట్లాడిన సురేఖపై సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాగచైతన్య ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు ఎండీ మున్నా, ఎండీ జావిద్, మార్త కిరణ్, బోళ్ల శ్రీధర్, మేకల రాజు, రాజేశ్, సునీల్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.