నర్సంపేట/వర్ధన్నపేట, జూన్ 13: నర్సంపేట పట్టణంలో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు గంటపాటు దంచికొట్టింది. దీంతో తీవ్ర ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది. పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపునీరు ప్రవహించింది. కాగా, రైతులు షాపుల్లో విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.
అలాగే, వర్ధన్నపేట మండలంలోని అంబేద్కర్‌నగర్ సమీపంలో పిడుగుపాటుకు ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. మాగి వంశీ(23), బంగారి హనుమాన్(16) గ్రామ సమీపంలోని క్రీడా మైదానంలో సేదతీరేందుకు వెళ్లారు. సాయంత్రం పిడుగు పడడంతో వంశీకి స్వల్ప, హనుమాన్కు తీవ్ర గాయాలయ్యాయి. వంశీకి వర్ధన్నపేటలో, హనుమాన్కు వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.
కమలాపూర్/శాయంపేట : మండలంలోని గోపాల్పూర్ గ్రామంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి ఓ ఇంటి పైకప్పు ఎగిరిపోయి గోడలు కూలిపోయాయి. పెద్ద చెట్టు కూలడంతో మరో ఇల్లు ధ్వంసమైంది. శాయంపేట మండలంలో కురిసిన వాన పత్తికి ఊపిరినిచ్చింది. కొద్దిరోజులుగా వానలు లేకపోవడంతో పత్తి విత్తనాలు ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో వర్షం కురవడంతో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పోగుంటలు పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. గాలి దుమారంతో కొత్తగట్టు సింగారం సమీపంలో జాతీయ రహదారిపై చెట్టు విరిగిపడింది.