నమస్తే నెట్వర్క్, మే 1 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి, గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. వరి నేలమట్టం కాగా, మామిడి కాయలు రాలిపోయాయి. ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు కూలగా, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు తడిసి ముద్దయ్యాయి. వాటిని ఆరబెట్టుకునేందుకు రైతులు శ్రమించాల్సి వచ్చింది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. గణపురం మండలంలో పలు ఇల్లు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు కూలి రోడ్లపై పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
భూపాలపల్లిలో ఇండ్ల కప్పులు ఎగిరిపోయాయి. రేగొండ మండలంలో అరటి, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాటారంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ములుగులో చెట్లు, ఎన్హెచ్ వెంట ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గోవిందరావుపేట, తాడ్వాయి, వెంకటాపూర్ మండలంలో చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం కలిగింది. వరంగల్ జిల్లాలోని నర్సంపేట, చెన్నారావుపేట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు కొట్టుకుపోయాయి.