మహదేవపూర్(కాళేశ్వరం),ఆగస్టు 20 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్‌కు వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మహారాష్ట్రలోని ప్రాణహిత, తెలంగాణలోని గోదావరి నదితో కలిసి ఉధృతంగా ప్రవహిస్తున్నది. మంగళవారం బరాజ్ ఇన్‌ఫ్లో 6,65,170 క్యూసెక్కుల ప్రవాహం రాగా, బుధవారం 9,89,820 క్యూసెక్కులకు పెరిగింది.
మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ వద్ద గరిష్ఠ నీటి మట్టం 100 మీటర్లు కాగా, ప్రస్తుతం సముద్ర మట్టానికి 97.30 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోందని భారీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బరాజ్ దిగువన ఉన్న లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.