పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి మందులను కొనుగోలు చేస్తున్నది. ఆయా పీహెచ్‌సీలకు అవసరం మేరకు వివిధ రకాల ఔషధాలను సరఫరా చేస్తున్నది. వాటిని వైద్య సిబ్బంది రోగులకు సక్రమంగా అందించకపోవడంతో గడువు దాటిపోవడంతో పడేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. గణపురం మండల కేంద్రంలోని ప్రాథమి క ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల కోసం ప్రతి రోజూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తుంటా రు.
రోగులకు వైద్య పరీక్షలు చేసి సరైన మందు లు అందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో 250 నుంచి 300 మంది రోగులు పీహెచ్‌సీకి వచ్చేవారు. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం రోగుల సంఖ్య తగ్గింది. వచ్చిన వారికి సైతం తూతూ మంత్రంగా వైద్యసేవలందిస్తూ నామమాత్రంగా మందులు ఇవ్వడంతో విలువైన మందులు కుప్ప లు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. ఏళ్ల తరబడి నిల్వ ఉండడంతో వాటి కాలపరిమితి దాటిపోతున్నది.
చేసేదేమీ లేక ఆసుపత్రి సిబ్బంది వాటిని ఎవరూ చూడకుండా తగులబెడుతున్నారు. దీంతో దుర్వాసన వచ్చి అనారోగ్యానికి గురవుతున్నామని చుట్ట్టుపక్కల ఇండ్లలోని ప్రజలు ఆరోపిస్తున్నారు. గడువు తీరిన మందులు, వాడిన సూదులు, బ్యాండేజ్ క్లాత్‌లు జీపీ ట్రాక్టర్లో బయట పడేయాల్సి ఉండగా వైద్యశాల కాంపౌండ్లోనే పడేస్తున్నారు. సిబ్బంది రోగులతో కఠినంగా మాట్లాడుతున్నారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సమయానికి డాక్టర్లు ఉండడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీహెచ్సీలో వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, రోగులతో దురుసుగా ప్రవర్తిస్తున్నప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఏ ఒక్కరోజూ దవాఖానను సందర్శించి తనిఖీలు చేసిన దాఖలాలు లేవని ఆరోపిస్తున్నా రు. వైద్య సిబ్బంది ఉదయం 11 గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు గంటలలోపే వెళ్లిపోతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.
డాక్టర్లు, సిబ్బంది మండల కేంద్రంలో ఉండి వైద్య సేవలందించా ల్సి ఉండగా వరంగల్, హనుమకొండ, పరకాల నుంచి రాకపోకలు సాగిస్తూ సమయపాలన పాటించడం లేదని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజలకు మెరుగైన వైద్యం అందే లా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయమై పీహెచ్సీ వైద్యులకు ‘నమస్తే తెలంగాణ’ ఫోన్ చేయగా వారు స్పందించలేదు.
పేదలకు అందాల్సిన ఎంతో విలువైన ఔషధాలు చెత్తకుప్పల పాలవుతున్నాయి. అనారోగ్యంతో దవాఖానకు వచ్చిన వారికి అన్ని రకాల మందులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో వాటికి కాలం చెల్లిన తర్వాత తగలబెడుతున్నారు. ఈ తతంగమంతా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలకేంద్రంలోని పీహెచ్సీలో జరుగుతున్నది.
– గణపురం, మే 16