కొడుకంటే కష్టాలు కడతేర్చేవాడు.. కొడుకంటే కడుపున పెట్టుకొని కాపాడేవాడు.. కొడుకంటే ఇంటి బరువు మోసేవాడు.. కొడుకంటే ఇంటి పేరు నిలబెట్టేవాడు. మరి ఇతడెందుకో కర్కోటకుడిగా మారాడు. కన్నతల్లినే తల, మొండెం వేరు చేసి మరీ కడతేర్చాడు. కేవలం భూమి కోసం ఈ ఘాతుకానికి పాల్పడి తల్లీకొడుకుల బంధానికే కంట నీరు తెప్పించాడు. కని, పెంచి పెద్దచేసి ‘ప్రయోజకుడిని’ చేసినందుకు ప్రతిగా పేగుబంధమే వలవల ఏడ్చేలా చేశాడు. గురువారం ఉదయం జనగామ జిల్లా జనగామ మండలంలోని మరిగడి గ్రామానికి చెందిన కురాకుల రమణమ్మ (62)ను ఆస్తి తగాదాలతో కన్న కొడుకే నరికి చంపాడని తెలిసి ఉమ్మడి జిల్లా ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. చేతులారా పెంచిన తల్లిని కత్తితో కోసి చంపేందుకు చేతులెలా వచ్చాయని దుమ్మెత్తిపోశారు.
జనగామ రూరల్, ఫిబ్రవరి 9: నవమాసాలు మోసి కని పెంచిన తల్లిపైనే కక్షగట్టాడు. విద్యాద్ధులు నేర్పించి ప్రయోజకుడిని చేస్తే ఆస్తి కోసం ఉన్మాదిలా మారాడు. చెల్లెలికి నాలుగు ఎకరాలు రాసిచ్చినందుకు కక్ష పెంచుకున్నాడు. కొద్ది రోజులుగా నిత్యం తల్లితో గొడవపడడమేగాక ఆమె పాలిట కాలయముడిలా మారాడు. నరరూప రాక్షసుడిలా కత్తితో తల్లి మెడను నరికి తలను, మొండేన్ని వేరు చేశాడు. గురువారం ఉదయం జనగామ జిల్లా మరిగడి గ్రామంలో జరిగిన ఈ దారుణం ఉమ్మడి జిల్లాలో విషాదం నింపింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మరిగడికి చెందిన కురాకుల రమణమ్మ(62)కు ఇద్దరు పిల్లలు. కొడుకు కన్నప్ప, కూతురు లావణ్య. పదేళ్ల క్రితమే భర్త రాజయ్య చనిపోయాడు. వీరికి మరిగడిలో ఆరెకరాలు, రఘునాథపల్లి మండలగూడెంలో నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. లావణ్య కులాంతర వివాహం చేసుకొని ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో కన్నప్పకు తెలియకుండా మండలగూడేంలోని నాలుగు ఎకరాల భూమిని రమణమ్మ నెలరోజుల క్రితం లావణ్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించింది.
గతంలోనే కొడుకు కన్నప్పకు రెండు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసింది. కూతురికి భూమి ఇచ్చిన విషయం ఇటీవల కన్నప్పకు తెలియడంతో రమణమ్మను ప్రశ్నించాడు. దీంతో ఇంట్లో ఆస్తి గొడవలు మొదలయ్యాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. తనకు రెండెకరాల భూమి మాత్ర మే ఉందని, మరో రెండెకరాలు రిజిస్ట్రేషన్ చేయాలని కన్నప్ప డిమాండ్ చేశాడు. మిగతా రెండెకరాలు తల్లి పేరిట ఉంచుకోవాలని చెప్పగా, పెద్దమనుషుల సమక్షంలో చర్చ జరిగింది. గొడవలు పెరిగిన క్రమంలో ఈనెల 5న రమణమ్మను కన్నప్ప గొడకేసి కొట్టడంతో తలకు గాయమైంది.
దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆస్తి విషయమై పెద్దమనుషులతో గ్రామంలో మాట్లాడుకుంటామని కన్నప్ప పోలీసులకు చెప్పాడు. పరిస్థితి ఇలా ఉండగానే కన్నప్ప ఆత్మహత్యకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందిన కన్నప్ప రెండు రోజుల క్రితం డిశ్చార్చి అయి ఇంటికొచ్చాడు. చెల్లెకు ఆస్తి రాసివ్వడంపై కక్ష పెంచుకున్న కన్నప్ప గురువారం ఉదయం 8 గంటల సమయంలో కత్తితో రమణమ్మ మెడ నరికాడు. ఆమె తలను, మొండేన్ని వేరు చేశాడు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లినే కన్నప్ప నరికి చంపడంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. ‘చెల్లెలికి నాలుగు ఎకరాల భూమి ఇచ్చినందుకు ఇంత కక్ష పెంచుకుంటాడా.. తల్లినే చంపుతాడా.. వీడికేం పోయే కాలం..’ అని పలువురు మండిపడ్డారు. ఆస్తి మొత్తం తనకివ్వకుండా చెల్లెలికి ఇస్తుందేమోనన్న కక్షతోనే కన్నప్ప క్షణికావేశంలో తల్లిని చంపాడని.. ఆస్తి కోసం ఇంత దారుణానికి పాల్పడుతారా.. అని ఆందోళన వ్యక్తం చేశారు.
పెద్ద మనుషులు పంచాయితీ పేరుతో నెల రోజులుగా సాగదీశారని, లేనిపోని మాటలు చెప్పి పచ్చని సంసారంలో చిచ్చుపెట్టారని స్థానికులు చెబుతున్నారు. ఆస్తిలో కూతురు, కొడుకుకు వాటా ఇవ్వాలని చట్టం చెబుతున్నా కొందరు రాద్దాంతం చేసి ఇంట్లో గొడవ సృష్టించారని సమాచారం. పెద్దమనుషులు సరైన తీర్పు ఇస్తే రమణమ్మ బలయ్యేది కాదని చర్చించుకుంటున్నారు.
ఘటనా స్థలాన్ని జనగామ డీసీపీ సీతారాం పరిశీలించారు. ఆస్తి కోసం గొడవ పడొద్దని, వివాదాలుంటే చట్ట ప్రకారం వెళ్లాలని ప్రజలకు సూచించారు. అవసరమైతే పోలీసులను సంప్రదించాలని, కోర్టును ఆశ్రయించాలని ఆయన కోరారు. రమణమ్మను హతమార్చిన నిందితుడు కన్నప్పపై కేసు నమోదు చేశామని, నిందితుడిని కోర్టులో ప్రవేశపెడుతామని తెలిపారు. ఆయన వెంట జనగామ ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి, సీఐ ఎలబోయిన శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.