Warangal | హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 12 : చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని దేవాలయంలో పంచముఖ ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం చందనపూజ నాగవెల్లి తమలపాకుల పూజ తులసిమాలతో వడమాలలతో పుష్పమాలలతో అలంకరించి ఆంజనేయస్వామి నామస్తోత్రంలతో పూజలు నిర్వర్తించి చిత్రాన్నం గూడక్షీర నైవేద్యం సమర్పించి నీరాజనా మంత్రపుష్పాలు అర్పించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
సీతను అన్వేషిస్తున్న హనుమంతుడు లంకలో ఆమెను కనుక్కున్నాడు ఆ సంతోషంలో అశోకవనాన్ని నాశనం చేశాడు, రావణుడి సైనికులు ఆయనను బంధించి తోకకు నిప్పు అంటిస్తే ఆ నిప్పుతో లంక దహనం చేశారని ఆరోజు చైత్ర పౌర్ణమి రావణుడి సైన్యంపై హనుమంతుడు సాధించిన విజయానికి చిహ్నంగా ఈ వేడుకలను నిర్వర్తించుకోవడం సాంప్రదాయంగా మారిందన్నారు. రావణ సంహారం తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిశక్తుడైన రాముడు తన విజయానికి ఎంతో దోహదపడిన హనుమంతుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని ఘనంగా సత్కరించారు. చైత్ర పౌర్ణమి నాడు జరిగిన ఈ సత్కారానికి చిహ్నంగా ఆ రోజున ప్రజలు విజయోత్సవంగా జరుపుకుంటారని, వైశాఖ బహుళదశమి హనుమాన్ జయంతి జరుగుతుందన్నారు. ఈ విజయోత్సవం సందర్భంగా భక్తులందరూ హనుమత్ దీక్షాపరులు హనుమత్ చాలీసా పారాయణం భజనలు సుందరకాండ పారాయణం నిర్వర్తించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేందర్‌శర్మ, మణికంఠశర్మ, ప్రణవ్ వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈవో అనిల్‌కుమార్, సిబ్బంది మధుకర్, భక్తులు పాల్గొన్నారు.