‘అవ్వ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్న చందం గా ఉంది టెస్కో, ఆప్కో అధికారుల తీరు. చేనేత సొసైటీలకు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్హెడీసీ) అరువుపై యారన్ (ముడి సరుకు) ఇవ్వడం లేదంటే.. కోన్ (బయట కొనుగోలు చేసిన యారన్)తో తయారు చేసిన ఉత్పత్తులు కొనమంటూ మెలిక పెడుతున్నారు. దీంతో రోజు రోజుకూ కార్పెట్లు, బెడ్షీట్ల నిల్వలు పేరుకుపోతుండగా.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా సంఘాల పరిస్థితి మారింది. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సొసైటీలకు ఆప్కో, టెస్కో పాత బకాయిలు చెల్లించక.. కోన్ ఉత్పత్తులు కొనక మరింత చితికిపోతుండగా.. పెట్టుబడులు పెట్టలేక, నేత కార్మికులకు పని కల్పించలేక సంఘాల ప్రతినిధులు చతికిల పడుతున్నారు. సంఘాల్లో స్టాక్ పెట్టుకొని కార్మికులకు చేతినిండా పని ఎలా ఇస్తామంటూ ఆవేదన చెందుతున్నారు. దీంతో పని దొరకక ఇంటి వద్దే ఖాళీగా ఉండాల్సి వస్తున్నదని నేతన్నలు వాపోతున్నారు.
– పోచమ్మమైదాన్, జూలై 17
వరంగల్ జిల్లాలో 34 వరకు చేనేత సహకార పారిశ్రామిక సంఘాలు, మరో 26 వరకు మాక్స్ సంఘాలు పనిచేస్తున్నాయి. ఇందులో దాదాపు రెండువేల మంది చేనేత, మరో వేయి మంది నూలు పట్టే కార్మికులు పని చేస్తున్నారు. అయితే కొత్తవాడ, తుమ్మలకుంట, ఎల్బీనగర్, కరీమాబాద్, మట్టెవాడ ప్రాంతాల్లోని చేనేత సహకార సంఘాల్లో కార్మికులు కార్పెట్లు, బెడ్షీట్లు తయారు చేస్తుంటారు. సంఘాల్లోని ప్రతినిధులు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్హెడీసీ) ద్వారా యారన్ కొనుగోలు చేసి, వాటితో నేత ఉత్పత్తులు తయారుచేయిస్తుంటారు. వీటిని టెస్కో అధికారులు మూడు, ఆరునెలలకు ఒకసారి కొనుగోలు చేస్తూ, వాయిదాల ప్రకారం బకాయిలు చెల్లిస్తుంటారు.
అధికారుల ఆదేశాల ప్రకారం చేనేత సంఘాల ప్రతినిధులు నేత ఉత్పత్తులకు కావాలసిన యారన్ను ఎన్హెచ్డీసీ ద్వారా కొనుగోలు చేయాలి. అయితే సంబంధిత అధికారులు యారన్ను సకాలంలో సరఫరా చేయకపోవడం, అరువు ఇవ్వకపోవడంతో సంఘాలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గతంలో యారన్ ఖరీదు డబ్బుల కోసం నెల, రెండు నెలలు సమయం ఇచ్చేవారు. ప్రస్తుతం నగదు చెల్లిస్తేనే సరఫరా చేస్తామని చెప్పడంతో సంఘాల ప్రతినిధులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కొన్ని సంఘాలు ప్రైవేట్లో అరువుపై వస్తున్న యారన్ను కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఇలా తయారు చేసిన ఉత్పత్తులను టెస్కో అధికారులు కొనుగోలు చేయకపోవడంతో సంఘాల్లో స్టాక్ పేరుకుపోతున్నది. ఏడాదిగా ఇదే దుస్థితి ఉండడంతో నిల్వలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం సంఘాల్లో రూ.7 కోట్ల బెడ్షీట్లు, రూ.5 కోట్ల వరకు కార్పెట్లు నిల్వ ఉన్నట్లు తెలిసింది.
ఏపీలోని ఆప్కో, తెలంగాణలోని టె స్కో అధికారులు కొనుగోలు చేసిన నేత ఉత్పత్తుల బకాయిలను సకాలంలో చెల్లించకపోవడంతో సంఘాలు ఆర్ధికంగా నిలదొక్కుకోలేకపోతున్నాయి. గత ఏడాది నవంబర్లో ఆప్కో అధికారులు కొనుగోలు చేసిన బెడ్షీట్లు, కార్పెట్లకు రూ. 5.76 కోట్లు, టెస్కో నుంచి రూ. 40 లక్షల బకాయిలు రావాల్సి ఉంది. ఒకవైపు ఉత్పత్తులు నిల్వ ఉండడం, మరోవైపు బకాయిలు చెల్లించకపోవడంతో సంఘాలు నేత కార్మికులకు ఉపాధి కల్పించలేకపోతున్నా యి. బయట తీసుకున్న డబ్బులకే వడ్డీలు చెల్లించలేకపోతున్నామని, బ్యాంకులు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేదని ప్రతినిధులు చెబుతున్నారు.
సంఘాల్లో పనులు లేక గోస పడుతున్నాం. రోజుకు పనికి వచ్చి కండెలు చుట్టేవాళ్లం. ఇప్పుడు సంఘాల పెద్దమనుషులు మాకు పని కల్పించడం లేదు. మీరు తయారు చేసిన సరుకు అట్లనే ఉంది. మీకు ఎక్కడ పని చూపించాలంటున్నరు. దీంతో రోజు పనిలేక ఇంటి వద్దనే ఉంటున్నం. నేత వృత్తిపై ఆధారపడ్డ మేము బయట పనులు చేసుకోలేకపోతున్నం.
– రాజ్యలక్ష్మి, వీరమణి, రమాదేవి, కండెలు చుట్టే కార్మికులు
రెండు నెలల నుంచి సంఘాల్లో పనులు దొరకడం లేదు. ఎంతో కష్టపడి మగ్గం నేర్చుకొని బెడ్షీట్లు, కార్పెట్లు తయారు చేయడానికి సిద్ధంగా ఉంటే సంఘాలు పనులు చూపెట్టడం లేదు. బయట కూలిపని చేసుకునే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు చేసిన పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మాకు మగ్గాల పనులే దిక్కు. చేతి నిండా పని లేకపోతే ఎలా బతకాలి.
– రాచర్ల స్వర్ణలత, కొత్తవాడ, వరంగల్
సంఘాల్లో ఖరీదులు లేవని మాకు పనులు చెప్పడం లేదు. మేము 25 ఏళ్ల నుంచి మగ్గం పనిచేస్తూ వృద్ధాప్యంలో కూడా దీనిపై ఆధారపడి బతుకుతున్నం. ఇప్పుడు పనులు లేవంటే మేమెక్కడికి పోవా లె. మమ్మల్ని కాంగ్రెస్ సర్కార్ ఆదుకోవాలి. లేకుంటే పస్తులుండే పరిస్థితి వస్తుంది. ఇంటి వద్ద పూట గడవడం కష్టమవుతున్నది.
– కూచన సారయ్య, కొత్తవాడ, వరంగల్