పౌరసరఫరాల సంస్థలో ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం రవాణాపై వివాదం తలెత్తింది. కాలపరిమితి ముగిసినందున తాను స్టేజీ-1 గోదాముల నుంచి స్టేజీ-2 గోదాములకు బియ్యం రవాణా చేయలేనని ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. కొత్త ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ నియామకం కోసం పౌరసరఫరాల సంస్థ ఇటీవల పిలిచిన టెండర్‌ను కొన్ని కారణాల వల్ల రద్దు చేసింది. దీంతో వరంగల్ జిల్లాలో స్టేజీ-2 గోదాములకు బియ్యం రవాణాకు తాజాగా బ్రేక్ పడింది. ఫలితంగా ఈ నెలలో ఇప్పటివరకు జిల్లాలోని పలు చౌక దుకాణాలకు పీడీఎస్ రైస్ చేరుకోలేదు. కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కాలేదు.
– వరంగల్, ఆగస్టు 11 (నమస్తేతెలంగాణ)
ఏటా ప్రభుత్వం వానకాలం, యాసంగి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) విధానంపై రైస్ మిల్లర్లకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఒప్పందం ప్రకారం రైస్ మిల్లర్లు సీఎంఆర్‌ను పౌరసరఫరాల సంస్థలోని స్టేజీ-1లోని బఫర్ గోదాములకు డెలివరీ చేయాలి. పీడీఎస్ ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయడం కోసం ఇక్కడి నుంచి స్టేజీ-2లోని మండల లెవల్ స్టాక్(ఎంఎల్ఎస్) గోదాములకు సంస్థ తరలిస్తుంది.
ఇందుకోసం టెండర్ల ప్రక్రియ ద్వారా ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లను నియమిస్తుంది. టెండర్ పొందిన కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకొని కాలపరిమితి ముగిసే వరకు రైస్ రవాణా చేస్తారు. కొన్ని సందర్భాల్లో టెండర్ల ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడితే ఆయా జిల్లాల్లో టెండర్ కాలపరిమితి ముగిసిన ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లనే సంస్థ కొనసాగిస్తుంది. వీరికి మొదట ఖరారైన రేట్లనే చెల్లిస్తుంది. ఈ క్రమంలో కాంట్రాక్టర్లు కొందరు తమకు రేటు గిట్టుబాటు కావడం లేదని తప్పుకుంటున్నారు. ఆ సమయంలో కొత్త టెండర్ ఖరారు కాకపోతే స్టేజీ-2లోని గోదాములకు బియ్యం రవాణాలో సమస్య తలెత్తుతున్నది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఇదే పరిస్థితి ఉత్పన్నమైంది.
వరంగల్ జిల్లాలోని ఏనుమాముల, నర్సంపేట, వర్ధన్నపేట కేంద్రంగా పౌరసరఫరాల సంస్థ స్టేజీ-2 గోదాములను నిర్వహిస్తున్నది. ఈ గోదాములకు బియ్యం రవాణా కోసం పౌరసరఫరాల సంస్థ చివరిసారి 2020లో ఓ ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్‌కు టెండర్ ఖరారు చేసింది. అతను నెలనెలా సుమారు 4 వేల టన్నుల పీడీఎస్ బియ్యాన్ని ఇన్నాళ్లు స్టేజీ-2 గోదాములకు రవాణా చేశాడు. అగ్రిమెంట్ ప్రకారం ఇతడి టెండర్ కాలపరిమితి 2021 సెప్టెంబర్ 30తో ముగిసినప్పటికీ అధికారుల సూచనలతో యథావిధిగా బియ్యం రవాణా చేస్తున్నాడు.
ఈ క్రమంలో కొత్త ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ నియామకం కోసం పౌరసరఫరాల సంస్థ పలుమార్లు టెండర్లు ఆహ్వానించినప్పటికీ వివిధ కారణాలతో టెండర్లు ఖరారు కాలేదు. చివరిసారి గత మే నెలలో పిలిచిన ట్రాన్స్‌పోర్టు టెండర్ కూడా ఇటీవల రద్దయ్యింది. ఈ క్రమంలో సదరు కాంట్రాక్టర్ తనకు పాత రేట్లు గిట్టుబాటు కావడం లేదని, 2024 జూలై 31వరకు మాత్రమే తాను బియ్యం రవాణా చేస్తానని ఇటీవల అధికారులకు తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఆ గడువులోగా బియ్యం రవాణా చేసి విరమించుకొన్నట్లు సమాచారం.
ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ విరమించుకొనే వరకు జిల్లాలోని మూడు ఎంఎల్ఎస్ గోదాములకు సుమారు 3,400 టన్నులకు పైగా బియ్యం రవాణా జరిగినట్లు తెలిసింది. వరంగల్ ఏనుమాముల గోదాముకు 400, నర్సంపేటకు 150కిపైగా టన్నుల రైస్ రవాణా కావాల్సి ఉంది. దీంతో ఎనుమాముల గోదాము పరిధిలో దాదాపు నలభై రేషన్ షాపులకు, నర్సంపేట గోదాము పరిధిలో మరికొన్ని రేషన్ షాపులకు ఈ నెలకు సంబంధించి పీడీఎస్ బియ్యం విడుదల జరగలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నెలలో 1 నుంచి 15లోగా కార్డుదారులకు బియ్యం పంపిణీ పూర్తి కావాల్సి ఉంది. 11వ తేదీ వరకు కూడా సుమారు 60 రేషన్ షాపులకు బియ్యం చేరుకోలేదు.
పౌరసరఫరాలసంస్థ అధికారుల నిర్లక్ష్యం, ముందుచూపు లేకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది. కాలపరిమితి ముగిసిన కాంట్రాక్టర్ బియ్యం రవాణా చేయనని ముందుగానే చెప్పినప్పటికీ ఆ గడువులోగా స్టేజీ-2 గోదాములకు బియ్యం రవాణా ప్రక్రియను పూర్తి చేయాల్సిన అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం చర్చనీయాంశమైంది. స్టేజీ-2గోదాములకు 550 టన్నుల బియ్యం ఎప్పుడొస్తాయి?, రేషన్ షాపులకు ఎప్పుడు చేరుతాయి?, కార్డుదారులకు పంపిణీ ఎప్పుడు జరుగుతుందనేది ప్రస్తుతం జిల్లాలో జవాబు లేని ప్రశ్నగా తయారైంది. వివరణ కోసం ‘నమస్తే తెలంగాణ’ ఫోన్ ద్వారా సంప్రదించగా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సంధ్యారాణి స్పందించలేదు.