హనుమకొండ, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్లోని చారిత్రక భద్రకాళీ చెరు వు పరిస్థితి దయనీయంగా మారింది. రూ.16 కోట్లతో చెరువును అభివృద్ధి చేశామని చెబుతున్న ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన కుదరడంలేదు. రెండేండ్లుగా చెరువులో నీళ్లు లేకుండా కిందికి వదిలి అభివృద్ధి చేసిన చెరువును మురికి నీటితో నింపడంతో కాలుష్య కాసారంగా మారుతున్నది. పద్మాక్షి గుడి, శాయంపేట జంక్షన్ మధ్యలో నుంచి భారీగా ము రుగు నీరు చెరువులోకి వెళ్తున్నది. ఇప్పుడే ఇలా ఉంటే భారీ వానలు కరిసినప్పుడు పరిస్థితి మరింత ఆందోళకరంగా ఉండనున్నది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, సాగునీటి శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చారిత్రక భద్రకాళీ చెరువు కంపు నీటితో దర్శనమిచ్చే పరిస్థితి నెలకొన్నది. భద్రకాళీ చెరువులోకి వరద నీరు వెళ్లే ప్రాంతాల్లోని కబ్జాలను నియంత్రించడంలో విఫలమైన అధికారులు.. డ్రైనేజీ నీటి విషయంలోనూ ఇలాగే చేస్తున్నారు. మురుగు నీరు భద్రకాళీ చెరువులోకి సులువుగా వెళ్లేందుకు భారీ మిషన్లతో కాలువ తవ్వినా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్తున్న అధికారులకు భద్రకాళీ చెరువులోకి మురికి నీరు వెళ్లేలా యంత్రాలతో దాదాపు కిలో మీటర్ మేర కా ల్వ తవ్వినా కనిపించకపోవడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భద్రకాళీ చెరువు అభివృద్ధి, సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ.16 కోట్లు ఖర్చు చేస్తున్నది. పూడికతీతతోపాటు చెరువులోకి డ్రైనేజీ నీరు చేరకుండా అభివృద్ధి పనులు చేపపట్టినట్లు ప్రకటించింది. పూడికతీత పూర్తయినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. మురికినీరు గతంలో కంటే ఎక్కువగా చెరువులోకి చేరుతున్నది. 382 ఎకరాల విస్తీర్ణంలోని భద్రకాళీ చెరువులో 18 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత పనులను 2025 మార్చి 11న మొదలు పెట్టారు. మొదటి ఎండాకాలంలో 6.40 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ వేసవిలో మరో 5.50 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీసినట్లు పేర్కొన్నారు. చెరువు పూడిక పనుల కోసం ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో రూ.16.10 కోట్లు కేటాయించారు. ఇంత భారీగా ఖర్చు చేసి ఇప్పుడు చెరువులోకి మురికి నీరు ప్రవహిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారుల నిర్లక్ష్యం.. భారీగా జరిగిన కబ్జాలతో భద్రకాళీ చెరువు కుంచించుకుపోయింది. కబ్జా భూముల్లో నిర్మించుకున్న ఇండ్ల నుంచి చెరువులోకి నిరంతరం మురికి నీరు ప్రవహిస్తున్నది. కబ్జాలను పట్టించుకోని అధికారులు, ఇప్పుడు చెరువులోకి వస్తున్న మురికి నీటిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. పూడికతీత కోసం రెండేండ్లుగా భద్రకాళీ చెరువులో నీళ్లు నిల్వ చేయడంలేదు. ఎండాకాలంలో పూడిక పనులు పూర్తయ్యాయి. చెరువు తూముల వద్ద గేట్లు అమర్చకపోవడంతో వర్షాలు పడినా చెరువు నిండే పరిస్థితి లేదు. వానలతో చెరువు నిండితే.. మురికినీరు అందులో చేరే విషయం ఎవరికీ తెలియదు. ఈ కారణంతోనే మురికి నీటిని చెరువులోకి వెళ్లేలా కొందరు పెద్ద కాల్వ తీసినట్లు స్పష్టమవుతున్నది. ఇప్పటికీ వానలు పడకపోవడం, చెరువులో నీరు నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో మురికి నీరే చెరువులోకి చేరుతున్నది.