పోచమ్మమైదాన్, మార్చి 7 : వరంగల్ 23వ డివిజన్ కొత్తవాడలో ఏర్పాటు చేసిన గ్రీన్ లెగసీ పార్కు స్థానికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. పలు రకాల చెట్లు, పూల మొక్కలతో ఉన్న ఈ ప్రకృతివనం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. సుమారు ఎకరంన్నర స్థలంలో ఉన్న ఈ పార్కు ఎంతగానో ఆకట్టుకుంటున్నది. 2020 జూన్ 28న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించిన గ్రీన్ లెగసీ పార్కు పచ్చదనంతో కళకళ లాడుతున్నది. ఇందులో ఇంటర్నల్ రోడ్లు, నీటి సదుపాయం కల్పించారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పార్కును నిర్వహిస్తున్నారు. ఇందులో ఎక్కువగా జామ, జమ్మి, బాదం, సీతాఫలం, శివ చింతకాయ, మామిడి, చింత, రామ ఫలం చెట్లతోపాటు పలు రకాల పూల మొక్కలు నాటారు. పార్కులో సేద తీరేందుకు అనువైన వాతావరణం కల్పించారు. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసుకునే వారికి ఈ పార్కు మైదానంగా ఉపయోగపడుతున్నది. ముఖ్యంగా పార్కుకు వెళ్లేటప్పుడు ఏర్పాటు చేసిన ముఖద్వారాన్ని అందంగా తీర్చిదిద్దడంతో స్థానికులను విశేషంగా ఆకర్షిస్తున్నది. కాగా, పార్కులో ప్రత్యేకంగా లైటింగ్ సదుపాయం, వాచ్మన్ను ఏర్పాటు చేయాలని మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ జీడబ్ల్యూఎంసీ అధికారులను కోరుతున్నారు.