ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు సోమవారం హనుమకొండ, వరంగల్ జిల్లాల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, యువత ఊరు, వాడ, పల్లె, పట్నం అంతటా కేక్‌లు కట్ చేసి సంబురాలు జరిపారు. యువకుల ఆధ్వర్యంలో చాలాచోట్ల రక్తదానం వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. ప్రజాప్రతినిధులు పేదలకు ఆహారం, పండ్లు పంపిణీ చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని అన్ని డివిజన్లలోనూ కేటీఆర్ బర్త్ డే వేడుకలను పండుగలా నిర్వహించారు. నగరంలోని 14వ డివిజన్ సుందరయ్యనగర్ పార్క్ స్థలంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, 19వ డివిజన్లోని ఓ సిటీ వీరాంజనేయస్వామి దేవాలయం వద్ద తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి, నర్సంపేట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ధర్మసాగర్ మండలం కరుణాపురంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య కేటీఆర్ బర్త్ డే వేడుకలు జరిపారు. కాగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జనగామ జిల్లా దేవరుప్పులలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారక రామారావు పుట్టిన రోజు వేడుకలను ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. ఊరు, వాడ, పల్లె, పట్నం అంతటా పండుగలా జరుపుకొని అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా బర్త్‌డే కేక్ కట్ చేసి సంబురాలు చేసుకోవడంతో పాటు పేదలకు అండగా నిలిచేందుకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కలు నాటి తమ ప్రియతమ నేత రామన్నకు కానుకగా ఇచ్చారు. యువకుల ఆధ్వర్యంలో చాలాచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని 79వేల మంది ఉపాధి హామీ కూలీలకు రూ.2కోట్లు వెచ్చించి లంచ్‌బాక్సులు ఇచ్చే కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దేవరుప్పులలో శ్రీకారం చుట్టారు. మానుకోటలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ కేక్ కట్ చేసి, మొక్కలు నాటి, కురవి వీరభద్రస్వామి ఆలయంలో పూజలు చేశారు.
అలాగే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయాచోట్ల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పేదలకు, దవాఖానల్లో రోగులకు, గర్భిణులకు పాలు, పండ్లు, ఆహారం పంపిణీ చేశారు. యువకులు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. గ్రేటర్ వరంగల్‌లోని ప్రతి డివిజన్‌లోనూ వేడుకలు జోరుగా జరిగాయి. వరంగల్‌లో విన్నూతంగా బుట్టల్లో టమాటాలు పెట్టి మహిళలకు అందించి బీఆర్ఎస్ నేత అభిమానం చాటుకున్నారు. పెంబర్తిలో రైతులు, కూలీలు పొలాల్లో ‘కేటీఆర్’ అక్షరక్రమంలో వరినాట్లు వేసి అభిమాన నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాళేశ్వరంలో ఆలయ ధర్మకర్తలు కేటీఆర్ పేరున ప్రత్యేక అభిషేకాలు చేసి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కావాలని ఆ భగవంతున్ని కోరారు. వేయిస్తంభాల గుడిలో ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ‘గిఫ్ట్ ఎ స్మైల్’లో భాగంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్ దంపతులు మహబూబాబాద్ జిల్లా దవాఖానకు రూ.2లక్షలతో అనస్తీషియా పరికరాన్ని అందజేశారు.