కమలాపూర్, మే 17: ధాన్యం తూకంలో తరుగు తీయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా పద్ధతి మార్చుకోని రైస్మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని గూడూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసి రైస్‌మిల్లుకు పంపితే ధాన్యం నూక అవుతుందనే సాకుతో రైస్‌మిల్లర్లు తరుగు తీస్తున్నట్లు రైతులు సీపీకి విన్నవించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరుగు పేరుతో అధిక మొత్తంలో కోత పెడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముచ్చర్ల నాగారం క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న సప్తగిరి రైస్‌మిల్లును సీపీ పోలీసు అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ధాన్యం తూకం వేసిన రసీదు, రైస్‌మిల్లు యాజమాన్యం నమోదు చేసిన తూకం రసీదులను పరిశీలంచారు. తూకం వేసిన రసీదు, రైస్‌మిల్లు యాజమాన్యం నమోదు చేసిన రసీదుల్లో తేడా ఉన్నట్లు గుర్తించారు. రైతులను తరుగు పేరుతో దోచుకుంటున్న రైస్‌మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను సీపీ ఆదేశించారు.
రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు
హనుమకొండ: తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని సీపీ ఏవీ రంగనాథ్ మిల్లర్లకు సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో సీపీ బుధవారం హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తాపట్నాయక్, ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు, పోలీసు అధికారులతో సమీక్షించారు. రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట వర్షానికి కొట్టుకుపోయిందని తెలిపారు. ఇప్పుడు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని మిల్లర్లకు సీపీ సూచించారు.
తరుగుపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక మొత్తంలో తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని తనిఖీల్లో తేలిందని రంగనాథ్ వెల్లడించారు. కొంతమంది మిల్లర్లు అత్యాశకు పోయి రైతులను నష్టపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టాస్క్‌ఫోర్స్ కమిటీలు నిత్యం పర్యవేక్షిస్తుంటాయని, ఇబ్బందులకు గురి చేస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రైతులు కూడా ధాన్యం కొనుగోళ్లలో నాణ్యత పాటించాలని, సిబ్బందికి సహకరించాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకూ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇప్పటి వరకు కొన్న ధాన్యం, రైస్ మిల్లర్ల వివరాలను హనుమకొండ, వరంగల్, జనగామ అదనపు కలెక్టర్లు వివరించారు. సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట, జనగామ అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీఆర్డీవో శ్రీనివాస్, సివిల్ సప్లయ్ డీఎం మహేందర్, డీసీఎస్వో వసంతలక్ష్మి, మార్కెటింగ్ అధికారి సురేఖ, మూడు జిల్లాల వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.