నర్సింహులపేట, ఏప్రిల్ 9: ఎంతో తిప్ప లు పడి యాసంగి పంట పండించిన రైతులు వాటిని అమ్ముకునేందుకు అంతే కష్టపడాల్సి వస్తున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారులు అలసత్యం కారణంగా రైతులు ఆగమవుతున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో తక్కువ ధరకు దళారులకు ధాన్యం అ మ్ముకొని నష్టపోతున్నారు. వరికోతలు ప్రారంభమైనా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం.. వాతావరణంలో వస్తున్న మార్పులతో రైతులు కలవర పడుతున్నారు.
పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో మండలంలో ఎక్క డా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రయ త్నం చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధరతోపాటు ప్రభుత్వం ఇస్తామన్న బోనస్ రూ.500ఎక్కువగా వస్తుందన్న ఆశతో కొనుగోలు కేంద్రాలకు వెళ్తే ధాన్యం అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది యాసంగి లో బోసన్ నయా పైసా వేయకపోవడం, కొ నుగోలు కేంద్రాలు ప్రారంభ కాకపోవడంతో రైతుల అవరాన్ని ఆసరాగా తీసుకొని ప్రైవేట్ వ్యాపారులు సన్న ధాన్యానికి రూ.1900 నుంచి రూ.2000 వరకు కొనుగోలు చేస్తున్నారు. నర్సింహులపేట మండలంలో 6, దం తాలపల్లి మండలంలో 10 కొనుగోలు కేంద్రా లు ప్రారంభించలేదు.
గతేడాది యాసంగిలో ఆకాల వర్షం వస్తే ధాన్యం తడవకుండా ఉం డేందుకు టార్పాలిన్లు సైతం అందుబాటులో ఉంచలేదని, దీనికి తోడు ఎండ తీవ్రత, వడదెబ్బ తగుల కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవ డం లేదని చెట్ల కింద, వాటర్ ట్యాంకుల కింద ఉండాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక పోవడంతో, తప్పని పరిస్థితిలో తక్కువ ధరకు అమ్ముకుంటున్నామని, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకా రం మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మండల వ్యాప్తంగా 6400 ఎకరాల మక్కజొన్న సాగు చేశారు. మక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించక పోవడం తో తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.2400 ఉంటే దళారులు మాత్రం రూ.1900లకే కొనుగోలు చేస్తున్నారు. నాణ్యమైన మక్కజొన్న దళారుల పాలైన తర్వాత ప్రభుత్వం కొంటే లాభమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. నాణ్యత పేరుతో కొర్రీలు పెట్టి మళ్లీ కొనుగోలు నిలిపివేస్తారని ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల లోపు కొనుగోలు ప్రారంభించకపోతే పంట పూర్తిగా దళారుల వద్దకు చేరుతుందని హెచ్చరించారు.
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలో యాసంగి వరి కోతలు మొదలై 15 రోజులు దాటింది. మంగపేట వ్యవసాయ మార్కెట్ యార్డు, గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు నిర్వహించే మైదానాలు, కల్లాలు ధాన్యం రాశులతో నిండిపోయాయి. వడ్లను తూర్పార పట్టి రాశులుగా పోసుకొని ఎదరుచూస్తున్న రైతులు కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. మండలవ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారిక లెక్కల ప్రకారం 16 వేల ఎకరాల్లో యాసంగి వరి సాగు చేస్తున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య సుమారు మరో 1500 ఎకరాలు ఉంటుంది. సహకార సంఘం, ఐకేపీ, మాక్స్ సొసైటీల ఆధ్వర్యంలో మొత్తం 31 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, మండలంలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా ప్రారంభించలేదు. దీంతో ముందుగా కోతలు కోసి అమ్మకాలకు ధాన్యం సిద్ధం చేసుకున్న రైతులు ఇబ్బందిపడుతున్నారు.