ములుగు : జిల్లా కేంద్రం పరిధిలోని మాధవరావుపల్లి గ్రామానికి చెందిన మైదం మహేష్ (30) అనే గ్రామ పంచాయతీ కార్మికుడు ( Panchayat Worker ) మూడు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడు. మూడు నెలల క్రితం ములుగు మున్సిపాలిటీగా మారడంతో గ్రామపంచాయతీలో పనిచేసిన కార్మికులే కొనసాగుతున్నారు. మహేష్ కూడా ప్రస్తుతం మున్సిపాలిటీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
కొన్ని నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనం కార్మికులందరికీ రాగా మహేష్‌కు రాలేదు. ఈ విషయమై పలుమార్లు అధికారులను కలిసి వేడుకున్నా పెండింగ్ వేతనం చేయలేదు. మంగళవారం విధులు నిర్వహించిన అనంతరం రాత్రి 7 గంటల వరకు వేతన విషయమై మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉన్నట్లు తెలిసింది.
వేతనం చేస్తామని హామీ ఇవ్వకపోవడంతో విసిగిపోయిన మహేష్ ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించగా అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ బుధవారం మహేష్ మృతి చెందాడు.