ములుగు, మార్చి10(నమసే ్తతెలంగాణ)/తాడ్వాయి : రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామాన్ని సందర్శించనున్నారు. కొద్ది నెలల క్రితం ములుగు జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఈ గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోగా స్థానిక మహిళలకు కుట్టు శిక్షణతో పాటు మసాలాల ప్యాకింగ్ యూనిట్లను అధికారులు ఏర్పాటు చేశారు. గవర్నర్ తన పర్యటనలో భాగంగా వీటిని ప్రారంభించనున్నారు.
అనంతరం మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. గవర్నర్ పర్యటనకు సంబంధించి కొండపర్తి, మేడారంలో ఏర్పాట్లను కలెక్టర్ టీఎస్ దివాకర సోమవారం పరిశీలించారు. అలాగే కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, డీఎస్పీ రవీందర్తో కలిసి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని, షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో వెంకటేశ్, అన్ని శాఖల అధికారులు, ములుగు, తాడ్వాయి మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు పాల్గొన్నారు.