ములుగు, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో కృషిచేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించారు. ఉదయం 11గంటలకు ములుగు ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకోగా మంత్రి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీష్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి కలెక్టరేట్ సమావేశ మందిరానికి చేరుకోగా, ఆదివాసీలు కొమ్ముకోయ నృత్యాలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జిష్ణుదేవ్‌వర్మ జిల్లా స్థాయి అధికారులతో సమావేశం కాగా, జిల్లా ప్రగతిని కలెక్టర్‌తో పాటు మంత్రి సీతక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్‌కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి గవర్నర్ పలు సూచలు చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో గిరిజనులు అన్ని రంగాల్లో ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఇతర వర్గాలకు ఆదర్శంగా నిలుస్తూ ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చేందుకు గిరిజనులు కృషి చేయాలని గవర్నర్ పేర్కొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలోని ప్రజలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారని అన్నా రు. ప్రతీ రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా నిర్వహించే మేడారం సమ్మక్క-సారలమ్మల మహా జాతర ను జాతీయ పండుగగా గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు.
అనంతరం గవర్నర్ ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకొని ఇన్టాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు, ప్రముఖ రచయిత రాచర్ల గణపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అంబటి శ్రీజన్, రెజ్లింగ్ క్రీడాకారిణి చల్లా మౌనిక, జిమ్మాస్టిక్స్ క్రీడాకారిణి పీ రజిత, వాలీబాల్ క్రీడాకారుడు పాలడుగు వెంకటేశ్వర్రావు, ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ కాజంపురం దామోదర్, సోషల్ వర్కర్ కొమురం ప్రభాకర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, గణిత ఉపాధ్యాయుడు కందా ల రామయ్య తదితర కవులు, కళాకారులు, ఇతర రంగా ల వారితో మమేకమ్యారు. అనంతరం వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఎస్పీ శబరీష్ నేతృత్వంలో ఓఎస్డీ మహేశ్ బాబాసాహెబ్ గీతే పర్యవేక్షణలో 800మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. గవర్నర్ వెంట ఆయన ప్రత్యేక కార్యదర్శి బుర్రా వెంకటేశం, జాయింట్ సెక్రటరీ జే భవానీశంకర్, భద్రత ఇన్చార్జి సిరిశెట్టి సంకీర్త్, అదనపు కలెక్టర్లు శ్రీజ, మహేందర్‌జీ, అదనపు ఎస్పీ సదానందం, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎఫ్‌వో రాహుల్ కిషన్‌జాదవ్, ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, డీఎస్పీ రవీందర్, డీఆర్డీవో సంపత్‌రావు, డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పాల్గొన్నారు.
– కాకతీయుల వైభవాన్ని చాటే కోటగుళ్లు
వెంకటాపూర్/గణపురం : మహాద్భుతమైన కట్టడం రామప్ప అని, ఇంతటి శిల్పకళను ఎక్కడా చూడలేదని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. మంగళవారం మధ్యా హ్నం వెంకటాపురం మండలంలోని రామప్ప ఆలయం, భూపాలపల్లి జిల్లా గణపురంలోని కోటగుళ్లను మంత్రి సీ తక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, భూపాలపల్లి, భద్రాచలం ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, తెల్లం వెంకట్రావ్‌తో కలిసి సందర్శించారు. రామ ప్ప ఆలయ గార్డెన్లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం దేవాదాయ శాఖ అధికారులుల, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప, కోటగుళ్లు ఆలయాల విశిష్టతను ప్రొఫెసర్ పాండురంగారావు, టూరిజం అసిస్టెంట్ ప్రమోషన్ అఫీసర్ కుసుమ సూర్యకిరణ్, వివరించారు. రామప్పలోని సరిగమల శిల్పాలు, నీటిలో తెలియాడే ఇటుకలను చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించగా చెరువు విస్తీర్ణం, ఆయకట్టు, కెపాసిటీని ఇరిగేషన్ సీఈ విజయ్ భాస్కర్ వివరించారు.
గవర్నర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. బండారుపల్లి రోడ్డు, కలెక్టరేట్ వైపు దుకాణాలను అధికారులు మూసివేయించారు. కలెక్టరేట్‌కు వచ్చే రోడ్లలన్నింటినీ బారికేడ్లతో బ్లాక్ చేశారు. దీంతో సామాన్య ప్రజలు, వ్యాపారులు, ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గవర్నర్ జిల్లా కేంద్రానికి చేరుకునే గంట ముందు నుంచే జంగాలపల్లి, ప్రేమ్‌నగర్ పెట్రోల్ బంక్ యూటర్న్ల వద్ద వాహనాలను నిలిపివేశారు. దీంతో జంగాలపల్లి వద్ద ట్రాఫిక్ జామ్ కాగా, ప్రేమ్‌నగర్ పెట్రోల్ బంక్ వద్ద 108 వాహనం కొద్ది సేపు నిలిచిపోయింది. అలాగే కవరేజీ కోసం వెళ్లిన జర్నలిస్టులను కలెక్టరేట్ గేటు వద్దే నిలిపివేశారు. రామప్ప, లక్నవరంలో సైతం అనుమతించలేదు. కలెక్టరేట్లో గవర్నర్ గ్రీవెన్స్ సెల్‌కు ప్రజలను అనుమతించకపోవడంతో ఎవరి కోసం ఏర్పాటు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటగుళ్లలో ఎవరినీ అనుమతించలేదు. ఐడీ కార్డు ఉన్నప్పటికీ గణపురం కార్యదర్శి విజేందర్‌ను భూపాలపల్లి ఎస్సై-2 సంధ్య బయటకు పంపి అవమానించారు. వారం రోజులుగా ఆలయంలో సిబ్బందితో పారిశుధ్య పనులు చేయించానని, ఇంకా చేయాల్సిన పనులున్నాయని చెప్పినా వినకపోవడంతో ఆయన అసహనంతో వెళ్లిపోయారు. అయితే ఎంతో బాధ్యతగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్సైకి పలు పార్టీల నాయకులు లోపలికి వెళ్లడం కనిపించలేదా? అంటూ పలువురు చర్చించుకున్నారు.
గోవిందరావుపేట : లక్నవరం సరస్సును మంగళవా రం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మంత్రి సీతక్కతో కలిసి సందర్శించారు. మొదటి వేలాడే వంతెన మీదుగా నడుస్తూ కాకరకాయ బోడ్ దీవికి చేరుకున్నారు. అనంతరం పాన్‌టూన్ బోటులో 2వ ఐలాండ్‌కు చేరుకు న్నారు. అంతకుముందు గవర్నర్‌కు లంబాడీ మహిళలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. రాత్రి 2వ ఐలాండ్‌లోని సమ్మక్క-సారక్క దీవిలో బస చేశారు. బుధవారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం తిరిగి హనుమకొండకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా లక్నవరం చుట్టూ పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.