మాతా శిశు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అక్షయ పాత్ర, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తుండగా, ఇప్పుడు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల నుంచి కేంద్రాలకు సన్న బియ్యం సరఫరా చేయాలని నిర్ణయించింది. హనుమకొండ జిల్లాలో పరకాల, భీమదేవరపల్లి, హనుమకొండ ప్రాజెక్టుల పరిధిలోని 788 కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీ కానుండగా, మొత్తం 36,473 మందికి ప్రయోజనం కలుగనుంది.
– హనుమకొండ, ఆగస్టు 9
హనుమకొండ, ఆగస్టు 9 : అంగన్వాడీల బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా మాతా శిశు ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇప్పటికే అక్షయ పాత్ర, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్న సర్కారు మరో బృహత్తర కార్యక్రమం చేపట్టింది. హనుమకొండ జిల్లాలోని అంగన్వాడీ సెంటర్లకు ఈ నెల నుంచి సన్న బియ్యం సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయంతో జిల్లాలోని హనుమకొండ, భీమదేవరపల్లి, పరకాల మూడు ప్రాజెక్టుల పరిధిలోని 788 అంగన్వాడీ సెంటర్ల ద్వారా సన్న బియ్యం భోజనం అందించనున్నారు. దీంతో జిల్లాలో 36,473 మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుందని ఆ శాఖ అధికారులు అంటున్నారు.
మాతా శిశు సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అంగన్వాడీ సెంటర్లకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. అందులో భాగంగా హనుమకొండ ప్రాజెక్టులోని 318, భీమదేవరపల్లి ప్రాజెక్టు పరిధిలోని 232 అంగన్వాడీ కేంద్రాల్లో అక్షయ పాత్ర, పరకాల ప్రాజెక్టు పరిధిలోని 238 కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా బియ్యం, పప్పుతో కూడిన మధ్యాహ్న భోజనంతో పాటు కోడిగుడ్డు, పాలు, చిన్నారులకు బాలమృతం అందజేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతల్లో లోప పోషణ, రక్తహీనత నివారణకు కృషి చేస్తున్నది. అదే విధంగా బరువు తక్కువ ఉండే మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం ప్లస్ అందిస్తున్నది.
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందుకుగాను ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. ఇప్పటికే అక్షయ పాత్ర, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నది. బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు బాలామృతం ప్లస్ అదనంగా అందిస్తున్నాం. ఈ నెల నుంచి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించనున్నాం. హనుమకొండ జిల్లాకు 11.40 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కేటాయించారు.
– కే మధురిమ, హనుమకొండ జిల్లా సంక్షేమాధికారి