చిన్నగూడూరు, జనవరి 27 : కేసీఆర్ హయాంలోనే ప్రభుత్వ పాఠశాలలకు పునరుజ్జీవం కలిగిందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావ్ అన్నారు. శనివారం ఎమ్మెల్సీ చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామంలో తన గురువు పానుగంటి జగన్నాథరెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. పాదాభివందనం చేసి ఆశీర్వాదం పొందారు. స్థానిక హైస్కూల్‌ను సందర్శించి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఉపాధ్యాయులు ఆయనను సన్మానించారు. గ్రామంలోని హార్ట్ ఫుల్నెస్ ధ్యానమందిరాన్ని సందర్శించారు. గ్రామంలోని బతుకమ్మ ఘాట్‌ను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల కోసం టాయిలెట్స్ నిర్మాణానికి రూ.5 లక్షలు, బతుకమ్మ ఘాట్‌కు మరో రూ.5 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం సర్కారు స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పించి, విద్యావ్యవస్థను బలోపేతం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మంగళంపెల్లి కన్న, జెర్రిపోతుల వెంకన్న, బానోత్ రవికుమార్, ఎల్ది మల్లయ్య, మడత వెంకన్న, పుచ్చకాయల రామకృష్ణ, స్థానికులు వల్లూరి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.