హన్మకొండ : అశాస్త్రీయమైన రోస్టర్ విధానం ( Roster system) రద్దు చేసే వరకు ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగ, విద్య, ప్రమోషన్ల నోటిఫికేషన్లు ( Notifications ) వెంటనే నిలిపి వేయాలని భీమ్ మిషన్ ఐడియాలజీ (BMI) రాష్ట్ర అధ్యక్షులు దామల్ల సర్వయ్య డిమాండ్ చేశారు. శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కాన్ఫరెన్స్ హాల్ లో బీఎంఐ హనుమకొండ జిల్లా కన్వీనర్ దండు మోహన్ అధ్యక్షతన రాజ్యాంగ పరిరక్షణ, రోస్టర్ విధానం పై అవగాహన సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్వయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాలలు చేసిన కృషికి కృతజ్ఞత మరిచి పోయి, రోస్టర్ విధానంతో తడిగుడ్డతో మాలల గొంతు కోస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీనీ భూ స్థాపితం చేయాలని కంకణం కట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రంలో లేని విధంగా అశాస్త్రీయమైన ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో చేశారని మండిపడ్డారు.
రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ తంబళ్ల చిట్టిబాబు మాట్లాడుతూ ఆర్టికల్ 341(2) ప్రకారం షెడ్యూల్డ్ కులాలను చేర్పులు, మార్పులు చేసే అధికారం పార్లమెంట్ చట్టం ద్వార మాత్రమే అధికారం ఉంటుందన్నారు. రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేశారు. రిటైర్డు డీఎస్పీ దామెర నర్సయ్య మాట్లాడుతూ రోస్టర్ పేరుతో మాలలకు అన్యాయం చేయాలనీ చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు.
సీనియర్ జర్నలిస్టు కంకణాల సంతోష్, విశిష్ట అతిథులు డాక్టర్ పుచ్చ లక్ష్మీనారాయణ, కునమల్ల అనురాధ, ప్రొఫెసర్ వెంకయ్య , కొత్త రవి, కూరాకుల భారతీ, డాక్టర్ శేషగిరి, రిటైర్డ్ ఎస్ఈ ముడిదెల శంకర్, డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ విగ్రహా పరిరక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ బండి అశోక్, మాలమహా నాడు జాతీయ ఉపాధ్యక్షులు మన్నె బాబూరావు, మాల జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్,మాల సంఘాల జేఏసీ కన్వీనర్ పోనుగంటి లక్ష్మీనారాయణ, సురాశి విక్రమ్, జిల్లా నాయకులు అంకేశ్వారపు రామచందర్, పనికల శ్రీనివాస్, దండ్రి సదానందం, వేముల రమేష్ తదితరులు పాల్గొన్నారు.