లింగాలఘనపురం, మార్చి 21: మిషన్ భగీరథ నీళ్ల సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో లింగాలఘనపురంలో అరకొరగా తాగు నీరందుతున్నదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కళ్లెం దారిలో ఉన్న 2.40 లక్షల లీటర్ల ఓహెచ్ఎస్ఆర్, తహసీల్ సమీపంలో 40 వేల లీటర్ల ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు మిషన్ భగీరథ నీటిని రోజూ రెండు సార్లు నింపేవారు.
అంతేగాకుండా అదనంగా గ్రామపంచాయతీకి ఉన్న 26 సోర్సుల ద్వారా సమృద్ధిగా తాగు నీరందేది. మల్లన్న సాగర్ పైపులైన్లో ఏర్పడిన సాంకేతిక లోపంతో మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ఒక్క ట్యాంకు ఒక్కపూట కూడా నిండడం లేదు. దీంతో పాటు పంచాయతీకి ఉన్న 26 సోర్సుల్లో 6 సోర్సుల్లోనే నీళ్లు ఉండడంతో ప్రజలకు అరకొరగా తాగు నీటిని సరఫరా చేస్తున్నారు.
లింగాలఘనపురంలో 20 ఏళ్ల క్రితం తాగునీటికి కష్టాలు పడ్డాం. మళ్లీ వారం రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి తాగునీటిని సక్రమంగా అందించాలి.
– ఏదునూరి వీరన్న, లింగాలఘనపురం
మిషన్ భగీరథ నీటి సరఫరాలో పైనుంచే అంతరాయం ఏర్పడింది. రోజూ లింగాలఘనపురంలోని రెండు ట్యాంకులను రెండు సార్లు నింపేవాళ్లం. లోపాన్ని సరిచేస్తున్నాం. మండలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– ప్రజ్వల్, ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఏఈ, లింగాలఘనపురం.