జనగామ, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వర్ధిల్లిన సర్కారు వైద్యం.. నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నది. స్థానికంగానే అర్హులైన వైద్యులు, అత్యాధునిక యంత్ర పరికరాలున్నా.. సేవల్లో మాత్రం లోపం కనిపిస్తున్నది. చేరువలోనే కార్పొరేట్ వైద్యం అందుతుందని వస్తున్న పేదలకు నిరాశే మిగులుతున్నది. చికిత్స అందించాల్సిన వైద్యులు ఇతర దవాఖానలకు రెఫర్ చేస్తుండడం ఇబ్బందులకు గురిచేస్తున్నది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పేదలు సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తున్నది. ఈ నిర్వాకం జనగామ జిల్లా ఆస్పత్రిలో ప్రతిరోజూ చోటుచేసుకుంటున్నది. చిన్న కేసులను కూడా పెద్దగా చిత్రీకరిస్తూ వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు తరలించడం విమర్శలకు దారితీస్తున్నది.
జనగామ జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన తర్వాత గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో చంపక్స్హిల్స్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటైంది. దానికి అనుబంధంగా ఉన్న ప్రధాన ఆస్పత్రిని జిల్లా స్థాయికి అప్‌గ్రేడ్ చేసి అర్హత కలిగిన వైద్యులను పెద్ద ఎత్తున నియమించింది. ఇక హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలకు పోవాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే వైద్యం అందుతుందని ఆశపడిన పేదలకు నిరాశే ఎదురవుతున్నది. ఇక్కడ కేవలం ఓపీ స్థాయి కేసులను మాత్రమే చూస్తున్న వైద్యులు.. ఎక్కువ తీవ్రతున్న కేసులు వస్తే క్షణాల్లోనే వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు రెఫర్ చేస్తున్నారు.
అయితే అక్కడి డాక్టర్లు వాటిని సాధారణ కేసులుగా పరిగణిస్తూ వైద్యం అందిస్తుండడం విచిత్రం. ఇలా ఎంజీఎంకు రెఫర్ చేస్తున్న కేసుల సంఖ్య గతంలో కంటే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. పైగా ఇక్కడి నుంచి రోగులను తరలించేందుకు ఆస్పత్రితో పాటు 108 అంబులెన్స్‌లను అధికంగా వినియోగించడం విమర్శలకు దారితీస్తున్నది. జిల్లా ఆస్పత్రికి అన్ని హంగులు సమకూరిన తర్వాత కూడా ఎంజీఎంకు పంపించడం రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నది.
బాధితుడి సమస్య ఆధారంగా క్రిటికల్ కేసులు, అత్యవసర సమయాల్లో మాత్రమే ఎంజీఎంకు రెఫర్ చేయాల్సిన వైద్యులు ఏ మాత్రం రిస్క్ తీసుకోవడం లేదు. ఆస్పత్రి అన్ని విభాగాలకు అర్హతలున్న పీజీ డాక్టర్లను నియమించినప్పటికీ ఈ పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తున్నది. కాగా ఇంట్రాఫెసిలిటీ ట్రాన్స్‌పోర్టేషన్ (ఐఎఫ్‌టీ) కింద 108 వాహనాల వివరాలు ఆరా తీయగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. చిన్నా చితక కేసులను సైతం ఎంజీఎంకు డాక్టర్లు సిఫార్సు చేస్తున్న కారణంగా ప్రమాదానికి గురైన వాళ్లు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఒక్కోసారి అవి వరంగల్ నుంచి తిరిగి వచ్చే వరకు బాధితులు వేచి చూడాల్సిన పరిస్థితి దాపురిస్తున్నది.
జనగామలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో సాధారణ కాన్పుల కంటే కడుపు‘కోత’ (శస్త్రచికిత్స)లు రోజురోజుకు పెరుగుతున్నాయి. 190 పడకలతో జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు పెద్దదిక్కుగా ఉన్న ఈ ఆస్పత్రిలో నెలకు 300కు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ఏడాదిన్నరగా సర్కా ర్ నిర్ధేశించిన లక్ష్యం మేరకు సాధారణ కాన్పుల కంటే ఆపరేషన్‌తోనే అధికంగా జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్పించిన అత్యాధునిక వసతులు, ప్రొఫెసర్ స్థాయి గైనకాలజిస్టులు, పిల్లల వైద్యులు సేవలందిస్తున్న ఎంసీహెచ్‌లో రోజుకు సగటున 10 ప్రసవా లు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ ప్రసవాలు 60 శాతం, సిజేరియన్ కాన్పులు 40 శాతం జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఆ శాతం తారుమారైంది. గత ఏడాది ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు సాధారణ కాన్పులు 863 జరిగితే సిజేరియన్లు 1,225 జరగడం ఆందోళన కలిగిస్తున్నది. అయితే మొదటి కాన్పుల్లో 90 శాతంకు పైగా సాధారణ ప్రసవాలే ఉంటున్నాయని, గతంలో శస్త్ర చికిత్స చేయడంతో రెండోసారి కూడా సెక్షన్ చేయాల్సి వస్తున్నదని వైద్యులు చెబుతున్నారు.