హనుమకొండ, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాకతీయ యూనివర్సిటీ భూముల లెక్క తప్పింది. రెవెన్యూ, అధికార యంత్రాంగం చేసిన సర్వేలోనే 60 ఎకరాలు కబ్జా అయినట్లు తేలింది. యూనివర్సిటీ అధికారులు, పోలీసులు, రాజకీయ నేతలే కబ్జా చేసినట్లు సర్వే నివేదిక పేర్కొన్నది. ఈ భూమి విలువ రూ. 100 కోట్లుండగా.. ఇందులో కబ్జాదారులు దర్జాగా ఇండ్లు కట్టుకొని అనుభవిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మిన్నకుండిపోయింది.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 76 మందికి మొక్కుబడిగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంది. అధికార పార్టీ పెద్దలు అడ్డుపడుతుండడంతో నివేదిక ఇచ్చి ఏడాది గడిచినా ఎటూ తేలకుండా మరుగునపడింది. ఇంత పెద్ద ఎత్తున భూములు కబ్జా అయినా.. ప్రహరీ నిర్మాణాన్ని యూనివర్సిటీ పట్టించుకోవడం లేదు. రూ. 20 కోట్లు డెవలప్మెంట్ ఫండ్ నుంచి మంజూరైనా అధికార పార్టీ నేతల అనధికార ఆదేశాలతోనే ప్రహరీ పనులు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వరంగల్‌లో కాకతీయ యూనివర్సిటీ 1976లో ఏర్పాటు కాగా, ప్రభుత్వం 680 ఎకరాల భూమిని అప్పగించింది. కుమార్‌పల్లిలో 188 ఎకరాలు, లషర్ సింగారంలో 309.20 ఎకరాలు, పలివేల్పుల శివారులో 175.14 ఎకరాల చొప్పున భూమి ఉన్నది. 1980లో యూనివర్సిటీ భూముల నుంచి ఎస్ఆర్ఎస్పీ కాలువ వెళ్లింది. కెనాల్ పరిసర ప్రాంతం యూనివర్సిటీకి అవసరమైన భవన నిర్మాణాలకు అనుగుణంగా లేకపోవడంతో అటువైపు ప్రహరీ నిర్మాణాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోలేదు.
ఇదే అదునుగా పలివేల్పుల, డబ్బాల ఏరియా, ముచ్చర్ల రోడ్డు వైపు ఉన్న భూమిని యూనివర్సిటీ, పోలీసు అధికారులు, రాజకీయ నేతలు దర్జాగా కబ్జా చేశారు. సర్వే నంబర్లకు స్వల్ప మార్పులు చేసి కాగితాలు సృష్టించారు. భూము ల కబ్జాపై ఆరోపణలు అధికమవడంతో 2023లో హనుమకొండ కలెక్టర్ డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం(డీజీపీఎస్) పద్ధతిలో సర్వే చేయించారు. యూనివర్సిటీకి 620 ఎకరాలే ఉన్నట్లు సర్వేలో తేలిం ది. కేయూ క్యాంపస్‌లోని 229, 234, 412, 413, 414 సర్వే నంబర్లలోని 60 ఎకరాల భూములు కబ్జా అయినట్లు నిర్ధారించారు. భూముల ఆక్రమణలపై సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, గ్రేటర్ వరంగల్ టౌన్ ప్లానింగ్, యూనివర్సిటీ డెవలప్మెంట్ ఆఫీసర్స్‌తో కలిసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సర్వే చేసి యూనివర్సిటీ చుట్టూ ఉన్న కబ్జాలను తేల్చారు.
కుమార్‌పల్లి శివారులోని 229 సర్వే నంబర్లో ఆక్రమణలున్నట్లు నిర్ధారించారు. యూనివర్సిటీ మాజీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్‌బాబుతోపాటు మరికొందరు ఈ సర్వే నంబర్ భూముల్లోనే ఇండ్లు కట్టుకున్నారు. పలివేల్పుల శివారు 412, 413, 414 సర్వే నంబర్ల భూముల్లో లష్కర్‌సింగారం శివారులో కబ్జాలు ఎక్కువగా ఉన్నట్లు తేలగా వీటిలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. కబ్జాలపై చర్యలు లేకపోవడంతో విద్యార్థులు, ప్రొఫెసర్లు ధర్నాలు చేసినప్పటికీ యూనివర్సిటీ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.
వరంగల్‌లో సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్) బెటాలియన్ ఏర్పాటు కోసం గతంలో కాకతీయ యూనివర్సిటీలోని రెండెకరాలు కేటాయించారు. రెండేండ్ల క్రితం బెటాలియన్‌ను ఇక్కడి నుంచి మణిపూర్‌కు తరలించారు. ఆ స్థలంలో పోలీసు ఫంక్షన్ హాల్, హరితహారం నర్సరీని నిర్వహిస్తున్నారు. వీటిని ఆనుకొని కరీంనగర్ జాతీయ రహదారి వెంట పోలీసు స్టేషన్ ఉన్నది. బెటాలియన్, నర్సరీ స్థలాలు తమవేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా సిబ్బంది అడ్డుకుంటున్నారు. ఈ ప్రాంతమంతా యూనివర్సిటీదే అయినా పోలీసు అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఈ స్థలంపైనా వివాదం నెలకొన్నది.
కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జా చేసిన వారిని ప్రభుత్వం చూసుకుంటుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ, కేయూ అధికారులు కలిసి యూనివర్సిటీ చూట్టూ ఫిజికల్ సర్వే చేశారు. ఫైనల్ రిపోర్టు ఇవ్వలేదు. సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఖాళీ చేసిన స్థలం స్వాధీనం, ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు భూమి కేటాయింపుపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
– కర్నాటి ప్రతాప్‌రెడ్డి, వైస్ చాన్స్‌లర్, కాకతీయ యూనివర్సిటీ