జనగామ, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాకేంద్రంగా ఆవిర్భవించిన జనగామ ఇక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(జుడా)గా అవతరించబోతున్నది. గత కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో జిల్లాకేంద్రాలుగా ఏర్పడిన పట్టణాలను అవసరమైన చోట ప్రణాళిక బద్ధమైన విస్తరణ, అభివృద్ధి, నాణ్యమైన పట్టణవాసం కల్పించేందుకు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(యూడీఏ)లుగా ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 4,03, 516 మంది ఉన్న జనగామ పురపాలక సంఘం 2024 అంచనా ప్రకారం 4,54,168 మందితో 1654.756 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో పట్ణణం విస్తరించింది.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 18 పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం 12 మండలాలు, 283 గ్రామాలతో విస్తరించిన జనగామ జిల్లా ఉంది. జఫర్‌గఢ్, స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు మండలాల పరిధిలోని 58 గ్రామాలు ఇప్పటికే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) పరిధిలో ఉండగా తాజాగా స్టేషన్ఘన్పూర్ను మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. జనగామ జిల్లాకేంద్రానికి విజయవాడ(సూర్యాపేట క్రాస్‌రోడ్డు)-దుద్దెడ నేషనల్ హైవే, వరంగల్-హైదరాబాద్ ఎన్‌హెచ్-365 వంటి రెండు జాతీయ రహదారులు సికింద్రాబాద్-విజయవాడ, సికింద్రాబాద్-ఢిల్లీ మధ్య రైలు కనెక్టవిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వంటి నాలుగు రాష్ర్టాలను కలిపే కూడలిగా ఉండే జనగామ జిల్లాకు నలువైపులా సూర్యాపేట, భువనగిరి యాదాద్రి, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల సరిహ ద్దు కలిగి ఉంది.
హైదరాబాద్‌కు 80 కిలో మీటర్ల పరిధితో ఉండడంతో మున్సిపాలిటీ సహా 225 గ్రామాలతో ‘జుడా’ ఏర్పాటుకు ప్రతిపాదించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పా లనలో జిల్లాల పునర్విభజన తర్వాత పట్టణీకరణలో భాగంగా సమీప గ్రామాల విలీనం తర్వా తే స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో పంచాయతీల విలీనం, నగర పంచాయతీలకు స్థాయి పెంపు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటు అంశాలు 2017లో తెరపైకి వచ్చాయి. అయితే వివిధ సాంకేతిక, కోర్టు వివాదాల కారణాలతో వెనక్కి వెళ్లాయి. తాజాగా జిల్లాకేంద్రంతో పాటు పట్టణీకరణ ప్రభావం, విస్తరణకు అవకాశాలున్న గ్రామాలు, 2011, 2024 జనాభా అంచనా, ఏరియా వంటి వివరాలతో కూడిన ప్రతిపాదిత ప్రణాళికను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ద్వారా పంపిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది.
జనగామ మున్సిపాలిటీ విస్తరణలో భాగంగా స్థాయి పెంపు ప్రతిపాదనకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న జనగామలో తొమ్మి ది సమీప గ్రామాలను విలీనం చేయడం ద్వారా తొలుత గ్రేడ్-1గా రూపాంతరం చెందనున్నది. ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్‌కు మున్సిపాలిటీ స్థాయి రానున్నది. తద్వారా కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లాలో మరో కొత్త మున్సిపాలిటీ ఏర్పడుతుందని ప్రభుత్వం భావించి ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు, సాంకేతిక అం శాలపై తాత్కాలిక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తున్నది. ఈమేరకు విలీన గ్రామాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆర్డీ, డీపీవో, టీపీఎస్‌కు ఆదేశాలు అందాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల నాటికి ప్రక్రియను పూర్తి చేయడం సహా డీపీఆర్ రూపొందించే బాధ్యత కన్సల్టెన్సీకి అప్పగించాలని కలెక్టర్ నిర్ణయించినట్లు తెలిసింది.
జనగామ మున్సిపల్‌కి మూడు కిలోమీటర్ల పరిధిలోని తొమ్మిది గ్రామ పంచాయతీల విలీ నం చేయాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నది. దీంతో సమీపంలోని నెల్లుట్ల, చీటకోడూరు, శామీర్‌పేట, యశ్వంతాపూర్, పెంబర్తి, ఎల్లంల, నాగారం, పసరుమడ్ల, వడ్లకొండ గ్రా మాల విలీనానికి అవకాశం ఉంటుంది. విలీన ప్రతిపాదనతో 98,661 నుంచి జనాభా సుమారు లక్ష దాటి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరిగి గ్రేడ్-1 మున్సిపాలిటీగా విస్తరిస్తుందని అధికారులు భావిస్తున్నారు.