కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్‌పై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి దాస్యం గురువారం కాజీపేటలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన హామీలపై ప్రధాని స్పష్టత ఇవ్వాలన్నారు. బీజేపీవి మోసపూరిత వాగ్దానాలని, మోదీ వచ్చిపోయినంక ఎన్నికలు రావడం ఖాయమని చెప్పారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు దమ్ముంటే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగు గిరిజన యూనివర్సిటీపై ప్రధానితో స్పష్టమైన ప్రకటన చేయించాలని, లేకపోతే తెలంగాణలో ఆ పార్టీ పతనం ఖాయమని పేర్కొన్నారు. మోదీకి, ఈడీకి ఇంటర్ లింకు ఉందని, కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
– హనుమకొండ, జూలై 6
హనుమకొండ, జూలై 6 : వరంగల్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. గురువారం కాజీపేటలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముందుగా దివంగత మాజీ మంత్రి దాస్యం ప్రణయ్‌భాస్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విభజన హామీలపై మోదీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి పోరాలు కొత్తకాదని, హామీలు అమలు చేసే వరకు కలిసివచ్చే రాజకీయ పార్టీలు, సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడుతామన్నారు. బీజేపీ నాయకత్వం ఇచ్చే ఏ ఒక్క హామీ అమలు కాదని చెప్పారు.
తెలంగాణలో మోదీ, ఈడీ వ్యవహారం సాగుతోందన్నారు. వరంగల్‌కు ప్రధాని వచ్చిపోయాక ఎన్నికలు రావడం ఖాయమని తెలిపారు. గతంలో హైదరాబాద్‌లో ఫార్మా సిటీని సందర్శించి వెళ్లిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయని గుర్తు చేశారు. 60 ఏళ్ల కలను నిజం చేసిన సీఎం కేసీఆర్‌కు తెలంగాణలోని సమస్యలు, ప్రజల అవసరాలు తెలుసు అని, ఆ దిశలో ప్రణాళికలు రూపొందించి రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. తొమ్మిది సంవత్సరాలుగా ఒక్క హామీ నెరవేర్చకుండా ఎన్నికల సమీపిస్తున్న వేళ బీజేపీ డ్రామాలు ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ప్రజల చిరకాల వాంఛ కోచ్ ఫ్యాక్టరీ విషయంలో బీజేపీ మోసపూరితంగా వ్యవహరిస్తున్నదన్నారు.
కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ తయారీ యూనిట్‌పై అనేక అనుమానాలు ఉన్నాయని, అనుకున్నంత ఆర్డర్స్ రావడం లేదని యూనిట్‌ను కూడా ప్రైవేట్ పరం చేసే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఫీజుబులిటీ లేదని పార్లమెంట్లో చెప్పిన మోదీ మహారాష్ట్రలో ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న వ్యాగన్ తయారీ యూనిట్‌కు డీపీఆర్ లేకుండా, కేబినెట్ ఆమోదం పొందకుండా, రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. రెండు, మూడు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో దీన్ని ప్రారంభిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు సిగ్గు, లజ్జ, పలుకుబడి ఉంటే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగు గిరిజన యూనివర్సిటీపై ప్రధానితో స్పష్టమైన ప్రకటన చేయించాలని, లేకపోతే తెలంగాణలో ఆ పార్టీ పతనం ఖాయమన్నారు. రానున్న రోజుల్లో కేంద్రంలో బీఆర్ఎస్ వస్తుందన్నారు.
తెలంగాణకు బీజేపీ చేసింది శూన్యం : మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్
కాజీపేట ఉత్తర, దక్షిణ భారత దేశానికి గేట్‌వే అని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమ చరిత్ర ఉందన్నారు. దేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే నుంచే రైల్వే శాఖకు అధిక ఆదాయం వస్తున్నదని, తొమ్మిదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ తెలంగాణకు ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. బీజేపీని ఎక్కడ ప్రజలు తిరస్కరిస్తారనే భయంతో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంటూ డ్రామాలు ఆడుతున్నారన్నారు. పదవుల ఎరవేస్తూ నాయకులను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒక్క రోజైనా విభజన హామీలపై ఎందుకు సమీక్షించలేదని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయించినప్పటికీ కుంటి సాకులు చెప్పారని, అదే ఏపీలో మాత్రం ప్రారంభించారని పేర్కొన్నారు.
బీజేపీకి విజన్ లేదు : ఎంపీ పసునూరి దయాకర్
కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు చేసింది ఏమీ లేదని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. తొమ్మిదేండ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపిందన్నారు. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. బీజేపీకి విజన్ లేదన్నారు. తెలంగాణలోని ఏ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నదని విమర్శించారు. వరంగల్ ప్రజలు చైతన్యవంతులని రాబోయే రోజుల్లో ఆ పార్టీకి గుణపాఠం చెబుతారన్నారు. కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్ సంకు నర్సింగరావు, బీఆర్ఎస్ నాయకులు నార్లగిరి రమేశ్, సుంచు కృష్ణ, కాటాపురం రాజు, శివ కుమార్, బస్వ యాదగిరి, సోనీ, అఫ్జల్, కుమ్మరి రాజ్, నయీం జుబేర్, శ్రీకాంతాచారి, కుమార్, కృష్ణ, సిరిల్ లారెన్స్, తండమల్ల వేణు, మైలారం శంకర్, రంజిత్, యాకూబ్, రాబర్ట్, మహమూద్, రామచందర్, బొట్టు రాజు పాల్గొన్నారు.