హనుమకొండ, నవంబర్ 6 : గోకుల్ సదర్ సమ్మేళనం బుధవారం రాత్రి హనుమకొండ పాత బస్ డిపో ఎదుట అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున పార్టీలకతీతంగా యాదవులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు తమ సంస్కృతీసంప్రదాయాలను ప్రదర్శించారు. ముఖ్యంగా దున్నపోతుల విన్యాసాలు చూపరులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరానికే పరిమితమైన గోకుల్ సదర్ సమ్మేళనం మొట్టిమొదటిసారి ఇక్కడ నిర్వహించడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. వచ్చిన అతిథులకు యాదవులు పగడిని అందజేశారు.
అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాజ్యసభ్యుడు మాందాటి అనిల్‌కుమార్ యాదవ్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, యాదవ నాయకులు సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, బంక సంపత్, రాజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ రోజు చారిత్రకమైన దినం అన్నారు. యాదవులకు అండగా నిలవాలనే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి గోకుల్ సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి జీవో జారీ చేశారని, అందుకు సీఎం కు యాదవుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
గోకుల్ సదర్ సమ్మేళన్‌లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముఖ్య అతిథులు మాట్లాడుతున్న క్రమంలో స్టేజి ముందున్న కాంగ్రెస్, బీఆర్ఎస్వీ వర్గాలు స్టేజీపైకి వెళ్లేందుకు ఒకరిని ఒకరు తోపులాడుకున్నారు. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఘర్షణ పడ్డారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందోనని వచ్చినవారు ఆందోళన చెంది పరుగులు తీశారు. పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గొడవపడ్డ వారిని అక్కడి నుంచి బయటకు పంపించడంతో సద్దుమణిగింది.
ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసిన నిర్వాహకులు ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని యాదవులే అనుకోవడం గమనార్హం. కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన లడ్డూ యాదవ్, నిర్వాహకులు బంక సంపత్ యాదవ్, మూగల కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, మామిళ్ల రాజుయాదవ్, జక్కుల రవీందర్ యాదవ్‌తో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన యాదవ నాయకులు, యాదవులు తదితరులు పాల్గొన్నారు.